Movies`కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా`.. ఈ డైలాగ్ బాల‌య్య కాద‌ని...

`కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా`.. ఈ డైలాగ్ బాల‌య్య కాద‌ని మీకు తెలుసా?

`కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా`.. అని `నరసింహనాయుడు` చిత్రంలో న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ చెప్పిన డైలాగ్ ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ ఒక్క డైలాగ్ బాక్సాఫీస్‌ వద్ద సినిమాకు కాసుల వర్షాన్ని కురిపించింది. అయితే ఈ ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ బాల‌య్యది కాద‌ని మీకు తెలుసా..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

వాస్త‌వానికి ఈ డైలాగ్ మహానటుడు ఎన్టీఆర్ గారిది. ఆయ‌న నోటి నుంచే ఈ డైలాగ్ పుట్టింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. రాజకీయాల్లోకి వెళ్లే ముందు సీనియ‌ర్ ఎన్టీఆర్ `నాదేశం` అనే మూవీ చేసిన సంగ‌తి తెలిసిందే. కె.బాపయ్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని పల్లవి దేవి ప్రొడక్షన్స్ పతాకంపై కె. దేవీవర ప్రసాద్, ఎస్. వెంకటరత్నం నిర్మించారు. జయసుధ హీరోయిన్ గా న‌టించ‌గా.. కైకాల సత్యనారాయణ విల‌న్‌గా చేశారు.

హిందీ హిట్ అయిన `లావారిస్` చిత్రానికి రీమేక్ ఇది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో మాత్రమే ఒక ఫైట్ ఉంటుంది. ఎన్టీఆర్‌కు మాస్ ఇమేజ్ ఉండ‌టం వ‌ల్ల‌.. ఆ ఒక్క ఫైట్ స‌రిపోద‌ని, మ‌రో ఫైట్ పెట్టాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావించారు. కానీ, ఈ విష‌యం అన్న‌గారితో చెప్పేంత ధైర్యం లేక‌..పరుచూరి గోపాలకృష్ణ ఆశ్రయించారు. దాంతో ఈ విష‌యం గురించి సీనియ‌ర్ ఎన్టీఆర్‌తో ఎలాగైనా చ‌ర్చించాల‌ని భావించిన పరుచూరి గోపాలకృష్ణ.. ఓ రోజు ఆయ‌న‌తో క‌లిసి షూటింగ్‌కు కారులో బ‌య‌లుదేరార‌ట‌.

కాసేపు అవీ, ఇవీ మాట్లాడుతూ.. మధ్యలో సినిమాలో మరో ఫైట్‌ ఉంటే బాగుంటుందనే విషయాన్ని ప్రస్తావించారు గోపాలకృష్ణ. అందుకు ఎన్టీఆర్ ‘ఏ సీనులో ఆ ఫైట్‌ పెడతారు?’ అని కూల్‌గా అడిగార‌ట‌. వెంట‌నే గోపాల‌కృష్ణ ఒక ఆర్టిస్ట్‌ పేరు చెప్పి.. ‘ఈ సందర్భంలో వారితో మీకు ఫైట్‌ పెడితే బాగుంటుందండి’ అని చెప్పార‌ట‌. అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేద‌ట‌. అయినా పరుచూరి వ‌ద‌ల‌కుండా.. ఆయ‌న్ను ఒప్పించేందుకు ప్ర‌య‌త్నించార‌ట‌.

దాంతో ‘దేనికైనా ఓ స్థాయి ఉంటుంది. సత్యనారాయణతో ఫైట్‌ ఉంటే చెప్పండి.. చేస్తాం. అంతేకానీ మీరు చెప్పిన వారితో ఫైట్‌ చెయ్యమంటారా.. మేం గట్టిగా కన్నెర్ర చేస్తే గుండాగి చస్తారు వారు` అన్నార‌ట‌. ఇక ఈ సంఘటన జ‌రిగిన ఇర‌వై ఏళ్లకు బాల‌య్య హీరోగా న‌టించిన ‘నరసింహనాయుడు’ చిత్రంలో యధాలాపంగా ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’ అనే డైలాగ్‌ రాశారు గోపాలకృష్ణ.

అయితే రాసిన తర్వాత కానీ అది అన్న‌గారు ఆనాడు త‌న‌తో అన్న డైలాగ్‌ అని గుర్తు రాలేద‌ట‌. మొత్తానికి తండ్రి నోటి నుంచి పుట్టిన డైలాగ్‌తోనే బాల‌య్య బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. 2001 సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయిన నరసింహనాయుడు చిత్రం అప్ప‌ట్లో ఏకంగా రూ. 30 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. థియేటర్‌లో `కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా` అన్న‌ డైలాగ్‌కు వచ్చిన స్పందన నెక్స్ట్ లెవ‌ల్ అనే చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news