Moviesటీవీ 9 దేవీతో గొడ‌వ‌... న‌న్నెవ‌డు పీక‌లేడంటూ మ‌ళ్లీ రెచ్చిపోయిన విశ్వ‌క్‌సేన్

టీవీ 9 దేవీతో గొడ‌వ‌… న‌న్నెవ‌డు పీక‌లేడంటూ మ‌ళ్లీ రెచ్చిపోయిన విశ్వ‌క్‌సేన్

గ‌త రెండు రోజులుగా హీరో విశ్వ‌క్‌సేన్ వ‌ర్సెస్ టీవీ 9 యాంక‌ర్ దేవి వివాదం సోష‌ల్ మీడియాలోనూ, ఇటు మీడియా స‌ర్కిల్స్‌లోనూ బాగా వైర‌ల్ అవుతోంది. రాను రాను చూస్తుంటే సోష‌ల్ మీడియాలో విశ్వ‌క్‌సేన్‌కు స‌పోర్ట్‌గా కామెంట్లు పెరుగుతున్నాయి. నెటిజ‌న్లు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. అదే ఓ పెద్ద హీరోను అయితే అలా ప్ర‌శ్నిస్తావా ? గెట‌వుట్ అంటావా ? అని టీవీ 9 యాంక‌ర్ దేవీపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించేస్తున్నారు. అటు దేవీ కూడా జ‌ర్న‌లిస్టుల‌తో క‌లిసి తెలంగాణ సినిమాటోగ్ర‌పీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌కు విశ్వ‌క్‌సేన్‌పై ఫిర్యాదు చేశారు.

ఈ ప‌రంప‌ర‌లోనే మ‌రోసారి విశ్వ‌క్‌సేన్ త‌న మాట‌ల‌కు ప‌దును పెట్టారు. టీవీ 9 స్టూడియోలో త‌నకు జ‌రిగిన అవ‌మానంతో పాటు ఆ ఛానెల్ త‌న‌పై చేసిన యాగీ నేప‌థ్యంలో న‌న్ను ఎవ్వ‌డూ ఏం పీక‌లేడు అంటూ ఘాటుగా రిప్లే ఇచ్చాడు. ఇలాంటివి తాను చాలా చూశాన‌ని కూడా చెప్పుకువ‌చ్చాడు. త‌న‌కు ఏదో జ‌రిగింద‌ని.. త‌న‌ను ఎవ‌డో ఏదో అన్నాడ‌ని తాను ఎప్పుడూ బాధ‌ప‌డ‌న‌ని.. త‌న‌కు ఫ్యామిలీ ఉంద‌ని.. ఇంట్లో అమ్మ‌, నాన్న‌, అక్క ఉన్నారు.. నా ఫ్యామిలీ బాధ‌ప‌డుతుంద‌న్న ఆలోచ‌న ఎందుకు ? చేయ‌రు ? తాను అమ్మ‌కు మాత్ర‌మే జ‌వాబుదారి అని అమ్మా నీ కొడుకును ఎవ్వ‌డూ ఏం చేయ‌లేడ‌ని త‌న బాధ‌, ఆవేద‌న బ‌య‌ట పెట్టాడు.

ఇక అమ్మాయిల‌కు తాను గౌర‌వం ఇవ్వ‌నంటూ జ‌రుగుతోన్న ప్ర‌చారాన్ని కూడా విశ్వ‌క్ ఖండించాడు. త‌న అమ్మ త‌న‌కు సంస్కారం నేర్పింద‌ని.. నిజంగా అమ్మాయిల‌కు గౌర‌వం ఇవ్వ‌క‌పోతే నిన్న జ‌రిగిన ఘ‌ట‌న‌ల్లో తాను సైలెంట్‌గా ఉండేవాడినే కాద‌ని చెప్పారు. ఇక ఈ సంఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత సోష‌ల్ మీడియాలో త‌న‌కు మ‌ద్ద‌తుగా వ‌స్తోన్న పోస్టులు చూస్తుంటే తాను ఎంత అభిమానం సంపాదించానో అర్థ‌మ‌వుతోంద‌ని.. ఇదంతా నా ఆస్తి.. న‌న్ను ఎవ్వ‌డూ పీక‌లేడ‌ని చెప్పుకువ‌చ్చాడు.

ఇక త‌న కొత్త సినిమా ప్ర‌చారం కోసం న‌డిరోడ్డుపై చిన్న ప్రాంక్‌చేశాడు విశ్వ‌క్‌. అయితే టీవీ 9 పాగ‌ల్‌సేన్ అంటూ త‌న‌కు అల‌వాటైన రేంజ్‌లోనే దానిపై హ‌డావిడి చేస్తూ ఓ డిబేట్ పెట్టింది. త‌న‌పై చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలుసుకున్న విశ్వ‌క్ నేరుగా ఛానెల్‌కు వెళ్లి డిబేట్ రూంకు వెళ్లిపోయాడు. అక్క‌డ చ‌ర్చ నిర్వ‌హిస్తోన్న యాంక‌ర్ దేవి ద‌గ్గ‌ర‌కు వెళ్లి స్వీట్ బాక్స్ ఇవ్వ‌డంతో పాటు త‌న సినిమాకు మీ ఆశీర్వాదాలు కావాల‌ని ఆకాంక్షించాడు.

అయితే త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేయ‌డంపై విశ్వ‌క్‌సేన్ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో దేవీ విశ్వ‌క్‌ను గెట్ అవుట్ ఆఫ్ మై స్టుడియో అన‌డంతో విశ్వ‌క్ కూడా ఓ మాట తూలాడు. దీంతో టీవీ 9 ప్ర‌పంచం మునిగిపోయింద‌న్న‌ట్టుగా దీనిపై వ‌రుస క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తూ వ‌స్తోంది. మంత్రి త‌ల‌సానితో పాటు మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్లో కూడా ఫిర్యాదు చేసింది. అయితే విశ్వ‌క్ ఈ విష‌యాన్ని ఇండ‌స్ట్రీ పెద్ద‌ల దృష్టికి తీసుకువెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news