MoviesTL రివ్యూ: టైగర్ నాగేశ్వరరావు.. గ‌ర్జించ‌ని టైగ‌ర్‌…

TL రివ్యూ: టైగర్ నాగేశ్వరరావు.. గ‌ర్జించ‌ని టైగ‌ర్‌…

టైటిల్‌: టైగర్ నాగేశ్వరరావు
నటీనటులు: రవితేజ-నుపుర్ సనన్-గాయత్రి భరద్వాజ్-హరీష్ పేరడి-జిషు సేన్ గుప్తా-నాజర్-రేణు దేశాయ్-అనుపమ్ ఖేర్-మురళీ శర్మ తదితరులు
మ్యూజిక్ : జి.వి.ప్రకాష్ కుమార్
సినిమాటోగ్ర‌ఫీ : మదీ నిర్మాత: అభిషేక్ అగర్వాల్
దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల
రిలీజ్ డేట్‌: 20, అక్టోబ‌ర్‌, 2023

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరోగా వచ్చిన సినిమా టైగర్ నాగేశ్వరరావు. స్టూవ‌ర్ట్‌ఫురం గ‌జ‌దొంగ బ‌యెపిక్ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ రోజు పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం.

క‌థ‌:
దొంగతనాలకు ఒకప్పుడు బాగా ఫేమస్ అయిన బాపట్ల తాలూకాలోని స్టువర్టుపురంలో ఒక దొంగతనం చేసే క్రమంలో 8 ఏళ్ళ వయసులోనే తండ్రిని చంపుతాడు నాగేశ్వరరావు ( రవితేజ ). 15 ఏళ్ల వయసు వచ్చేసరికి గజదొంగ మారతాడు. భారీ దొంగతనాలతో తమకు సవాల్గా మారిన నాగేశ్వరరావును పట్టుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అవుతాయి. ఒక దొంగతనం కేసులో పోలీసులు అతడిని మద్రాసు జైలులో పెడితే అక్కడ నుంచి కూడా తప్పించుకుంటాడు. టైగర్ నాగేశ్వరరావు గురించి ఒక దశలో ప్రధానమంత్రి భద్రతాధికారి సైతం కంగారు పడే పరిస్థితి తీసుకొస్తాడు. అతడు నాగేశ్వరరావు గురించి తెలుసుకోవడానికి స్టువర్టుపురం వస్తాడు. అక్కడ నాగేశ్వరరావులో తెలియని కోణాలు ఎన్నో బయటపడతాయి ? ఈ కోణాలు ఏమిటి అసలు నాగేశ్వరరావు ఎవరు ? అతడు ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు.. తాను దోచుకున్న డబ్బు ఏం చేస్తున్నాడు ? హీరోయిన్లు నుపూర్ ? గాయ‌త్రితో అత‌డి ప్రేమాయ‌ణాల క‌థ ఏమిటి ? చివరికి నాగేశ్వరరావు ప్రయాణం ఎక్కడ దాకా వెళ్ళింది ? అన్నదే మిగిలిన కథ.

విశ్లేష‌ణ :
స్టువర్ట్పురంలో టెర్రర్ రాజ్యంపై ఆధిపత్యం చెలాయించి తనవాళ్ళకు జీవితాన్ని ఇచ్చిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్.. కొన్ని ఎమోషన్ సీన్లు.. దోపిడీ సన్నివేశాలు నటీనటుల పనితీరు ఆకట్టుకుంటుంది. రవితేజ తన కెరీర్ లోనే ఒక ఛాలెంజింగ్ గా ఈ పాత్రలో నటించిన విధానం మెప్పిస్తుంది. తన గత సినిమాలలో కంటే ఈ సినిమాలో రవితేజ చాలా కొత్త లుక్స్ తో ఫ్రెష్ గా కనిపించాడు. హీరోయిన్ నుపుర్ స‌న‌న్ తన నటనతో ఆకట్టుకుంది. కొన్నిచోట్ల ఆమె పలికించిన హావభావాలు అదిరిపోయాయి. మరో హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ కూడా మెప్పించింది.

చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ హేమలత ల‌వ‌ణం పాత్రలో ఒదిగిపోయింది. అయితే ఆమె పాత్ర‌ను స‌రిగా ఎలివేట్ చేయ‌లేదు. ప్ర‌చారంలో ఉన్నంత‌గా ఆమెను వాడుకోలేదు. అనుపమ్‌కేర్‌, నాజర్, మురళీ శర్మ తమ పాత్రలకు న్యాయం చేశారు. జిసుసేన్ గుప్తా మరో ముఖ్యమైన పాత్రలో చాలా బాగా నటించాడు. కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు వంశీ చాలా బాగా తెరకెక్కించాడు. సినిమాలో మెయిన్ కంటెంట్ రవితేజ పెర్ఫార్మన్స్.. మాస్ ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. అయితే ట్రీట్మెంట్ విషయంలో కొన్నిచోట్ల స్లో అనిపించింది.

దీనికి తోడు దర్శకుడు కథనం విషయంలో రాజీ పడకుండా ఉండి ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో సినిమా నడుస్తుంటే తర్వాత ఏం జరుగుతుందని ? ఉత్కంఠ పెంచగలిగే అవకాశం ఉన్న ఆ దిశ‌గా స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ జరగలేదు. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు మంచి ప్రయత్నం చేసినా అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్గా వర్కౌట్ కాలేదు. 1970 – 80 ద‌శ‌కంలో కథ‌ జరుగుతున్నప్పుడు అప్పటి నేటివిటిని దృష్టిలో పెట్టుకుని సీన్లు తెరకెక్కించి ఉంటే బాగుండేది. టైగర్ నాగేశ్వరరావు పాత్రను మొదట్లో హై రేంజ్ ఎలివేషన్లలో చూపించిన దర్శకుడు సినిమా మొత్తం దానిని కంటిన్యూ చేయలేదు. మధ్య మధ్యలో వచ్చే ప్రేమ సన్నివేశాలు స్పీడు బ్రేకర్లలా అడ్డు తగిలాయి.

ఫ‌స్టాఫ్‌లో సినిమా ఓ రేంజ్‌లో ఉంటుంది. నాగేశ్వ‌ర‌రావు నేప‌థ్యం, అత‌డి ఎలివేష‌న్‌, ప‌రిచ‌యం అన్నీ ఒక రేంజ్‌లో ఉంటాయి. అయితే సెకండాఫ్ సినిమా గ్రాఫ్ త‌గ్గించింది. హీరోను ఎలివేట్ చేయడానికి పడ్డ అనవసర ప్రయాస.. ఓవర్ ద టాప్ సీన్లు.. విపరీతమైన సాగతీత ఈ సినిమా గ్రాఫ్‌ను త‌గ్గిస్తూ వ‌చ్చేశాయి.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…
టెక్నికల్ గా చూస్తే మంచి క‌థ‌ను తీసుకోవడంలో సక్సెస్ అయ్యాడు దర్శ‌కుడు వంశీ. కానీ ఉత్తమ కథనాన్ని రూపొందించడంలో.. దానిని ఇంకా ఆసక్తిగా తెరకెక్కించటంలో సక్సెస్ కాలేదు. ఈ సినిమాకు పనిచేసిన టెక్నికల్ డిపార్ట్మెంట్లో సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ అందించిన నేపథ్య సంగీతం పూర్తిగా తేలిపోయింది. అసలు సినిమాలో ఎక్కడా ఉత్కంఠ లేకుండా ఆర్‌ఆర్ఆర్ ఇచ్చాడు. ఇది సినిమాకు మైనస్. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ప్లో గా ఉన్న సన్నివేశాలకు కొన్నిచోట్ల కత్తెరలు వేసినట్టు అయితే బాగుండేది. కనీసం 10 నుంచి 15 నిమిషాల సన్నివేశాలను కట్ చేసినట్లయితే సినిమా రన్ టైం తగ్గి కాస్త క్రిస్పీగా ఉండేది. అభిషేక్ అగర్వాల్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైన‌ల్‌గా…
టైగర్ నాగేశ్వరరావు అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో ర‌వితేజ అదిరిపోయే న‌ట‌న హైలెట్. భారీ యాక్ష‌న్ సీన్లు, డెప్త్ ఎమోష‌న‌ల్ సీన్లు సూప‌ర్‌. అయితే స్క్రీన్ ప్లే స్లోగా ఉండ‌డం. భారీ ర‌న్ టైం.. ఫేక్ ఎమోష‌న్లు సినిమాకు మైన‌స్‌. ఓవ‌రాల్‌గా కొన్ని ఎలిమెంట్స్‌తో పాటు ఫ‌స్టాఫ్ కోసం ఓ సారి చూడొచ్చు.

ఫైన‌ల్ పంచ్‌: బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ గ‌ర్జించ‌ని టైగ‌ర్

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు రేటింగ్‌: 2.5 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news