Moviesఆచార్య ఎఫెక్ట్‌.. కొర‌టాల‌కు ఎన్టీఆర్ స‌ల‌హా...!

ఆచార్య ఎఫెక్ట్‌.. కొర‌టాల‌కు ఎన్టీఆర్ స‌ల‌హా…!

మూడేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ ఆచార్య సినిమా ఎట్టకేలకు ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. తొలి రోజు తొలి షో పడిన వెంటనే సినిమా డిజాస్టర్ అని చాలామంది మెగా అభిమానులు సైతం డిసైడ్ చేసేశారు. అసలు సినిమా రిలీజ్ కు ముందు ఎలాంటి భారీ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు కొరటాల శివ నాలుగు సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. చిరంజీవి పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి కూడా ఖైదీ నెంబర్ 150 – సైరా లాంటి హిట్ సినిమాలు చేసి ఉన్నారు.

సినిమా అయితే ఫ్లాప్ అయింది. భారీ నష్టాలు తప్పవు. సినిమా పరాజయంలో ఎవరి పాత్ర ఎంత‌ ఉందని అప్పుడే చాలా మంది లెక్కలు కడుతున్నారు. ఓవరాల్ గా మాత్రం సినిమా వైఫల్యానికి ప్రధాన కారణం దర్శకుడు కొరటాల శివ అని చాలామంది ఎత్తి చూపుతున్నారు. ఆచార్య ఫలితంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అయితే ఇప్పుడు ఆచార్య ఎఫెక్ట్‌తో ఇప్పుడు నందమూరి, ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఇందుకు కారణం కొరటాల శివ నెక్ట్స్‌ సినిమా ఎన్టీఆర్ తో ఉండటమే..!

 

త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ త‌న కెరీర్లో 31వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్‌రామ్, కొరటాల శివ సన్నిహితుడు మిక్కిలినేని సుధాకర్ కలిసి సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్నారు. ఆచార్య ఘోరంగా ప్లాప్‌ అవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన ప్రారంభమైంది. తమ అభిమాన హీరో సినిమా ఎలా ఉంటుంది ? కొరటాల ఈసారైనా జాగ్రత్త పడతాడా ? అటు రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ఎన్టీఆర్ సినిమా పై కూడా పడుతుందా ? అని రకరకాలుగా ఊహించుకుంటున్నారు.

ఇంత పెద్ద ప్లాప్ తర్వాత ఎన్టీఆర్ సినిమా చేస్తుండడంతో కొరటాలకు కూడా లోపల ఎక్కడో చిన్న ఆందోళన ఉండటం సహజం. అయితే ఎన్టీఆర్ కొరటాల శివకు ఓ సలహా ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆచార్య సినిమా ఫలితం గురించి ఆలోచించకుండా మన సినిమా కథ మీద ఫోకస్ పెట్టు… కావాలంటే ఇంకొంచెం టైం తీసుకో అని ఎన్టీఆర్ కొరటాలకు చెప్పినట్టు తెలుస్తోంది.

ఇక కొర‌టాల ముందు నుంచి సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్ గా లేరు. ఆచార్య సినిమా టైమ్‌లో ఆయన ట్విట్టర్ నుంచి బయటకు వచ్చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ మళ్ళీ ట్విట్టర్ లోకి రమ్మని కొర‌టాలను కోరినట్టు తెలుస్తోంది. మన సినిమా గురించి ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు అభిమానులకు అప్డేట్ ఇవ్వడంతోపాటు… సినిమా పరంగా వారి సలహాలు ఏమైనా ఉంటే వాటిని స్వీకరించడానికి కూడా ఉపయోగపడుతుందని ఎన్టీఆర్ కొరటాలకు సూచించినట్టు సమాచారం.

ఆచార్య రిలీజ్ అవ్వడంతో పది రోజులు గ్యాప్ తీసుకుని అనంతరం కొర‌టాల‌ ఎన్టీఆర్ సినిమా ప్రారంభిస్తారు. జూన్ లేదా జులై నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. గతంలో వీరిద్ద‌రి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అవడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలే ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news