Moviesఒకే సినిమా ఒకే కేంద్రంలో 3 థియేట‌ర్ల‌లో 365 రోజులు... బాల‌య్య...

ఒకే సినిమా ఒకే కేంద్రంలో 3 థియేట‌ర్ల‌లో 365 రోజులు… బాల‌య్య వ‌ర‌ల్డ్ రికార్డు ఇదే..!

ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన తాతమ్మకల సినిమాతో బాలయ్య వెండితెరపై హీరోగా ఆవిష్కృతం అయ్యాడు. కెరీర్ ఆరంభంలో బాలయ్య తన తండ్రి దర్శకత్వంలోనే ఎక్కువ సినిమాల్లో నటించారు. రెండు మూడు సినిమాలు బాగా ఆడాయన్న‌ పేరువచ్చింది.. నటనలో తండ్రికి తగ్గ తనయుడే అన్న ప్రశంసలు దక్కాయి. సోలో హీరోగా బాలయ్యకు పెద్ద కమర్షియల్ హిట్ అయితే రాలేదు. అయితే ఈ కోరిక బాలయ్య 15వ సినిమా అయినా మంగమ్మగారి మనవడుతో తీరిపోయింది. బాలయ్యకు కలిసివచ్చిన బ్యానర్ అయిన భార్గవ్ ఆర్ట్‌ ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఎస్.గోపాల్ రెడ్డి నిర్మాత.

కోలీవుడ్లో తెరకెక్కి సూపర్ హిట్టయిన మట్టివాసన సినిమా ఆధారంగా మంగమ్మగారి మనవడు సినిమా తెలుగులో తెరకెక్కింది. బాలయ్య తొలి సినిమా తాతమ్మకల కాంబినేషన్ గుర్తుచేస్తూ భానుమతి – బాలకృష్ణ కాంబినేషన్ లో ఈ సినిమా వచ్చింది. బాలయ్య పక్కన సుహాసిని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా 1984 సెప్టెంబర్ 9న రిలీజ్ అయింది. గణేష్ పాత్రో సంభాషణలు – భానుమతి పాత్ర ఔచిత్యం – వై విజయ సంభాషణలు – కోడి రామకృష్ణ దర్శకత్వం – బాలయ్య హీరోయిజం ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల మదిలోకి తీసుకు వెళ్లిపోయాయి. ఈ సినిమాలో ఎక్కువ భాగం గోదావరి జిల్లాల్లోని కడియం, కడిపిలంక, ఉండ్రాజవరం, పట్టిసీమ ప్రాంతాలలో చిత్రీకరించారు.

సినిమాలో శ్రీ సూర్యనారాయణ మేలుకో – దంచవే మేనత్త కూతురా – చంద్రుడు నిన్ను చూసి – వంగతోట కాడ వొళ్ళు జాగ్రత్త – గుమ్మ చూపు నిమ్మ ముల్లు సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. కె.వి.మహదేవన్ స్వరపరచిన పాటలు అప్పట్లో తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేశాయి. బాలయ్య కెరీర్ లో తొలి కమర్షియల్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా పలు కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకోవడంతో పాటు సంవత్సరం పాటు ఆడి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

మంగమ్మగారి మనవడు తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ హీరో టచ్ చేయని… భవిష్యత్తులో టచ్ చేయలేని అసాధారణ రికార్డులు క్రియేట్ చేసింది. ఐదు థియేటర్లలో 150 రోజులు ఆడిన ఈ సినిమా – నాలుగు థియేటర్లలో 175 రోజులు ఆడింది. ఇక హైదరాబాదులో మూడు థియేటర్లలో 365 రోజులు ఆడి భారతదేశ సినీ చరిత్రలో ఓ సంచలన రికార్డు క్రియేట్ చేసింది. నాలుగు ఆటలతో ఒకే కేంద్రంలో మూడు థియేటర్లలో 365 రోజులు ఆడటం అంటే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టో తెలుస్తోంది.

ఈ సినిమా గురించి మరో సంచలన విషయం కూడా ఉంది. ముందుగా ఈ కథ విన్న ఎన్టీఆర్ తమిళ సినిమా కథ బాలయ్యకు సూట్ అవుతుందా ? అన్న సందేహంతో కథను రిజెక్ట్ చేశారు. అయితే బాలయ్య – కోడి రామకృష్ణ ఎన్టీఆర్ ను ఒప్పించి కొన్ని మార్పులు చేసి వందరోజుల షీల్డ్ తోనే మళ్ళీ మీ దగ్గరికి వస్తాము అని చెప్పారు. ఎన్టీఆర్ ఓకే చెప్పడంతో పాటు ఈ సినిమాలో భానుమతి పాత్రకు ఎన్టీఆర్ స్వయంగా రికమెండ్ చేశారు. చివరకు సినిమా సూపర్ హిట్ అయ్యాక ఎన్టీఆర్ సైతం అంత గొప్ప విజయం చూసి ఆశ్చర్యపోయారు.

ఓవ‌రాల్‌గా మంగ‌మ్మగారి మ‌న‌వ‌డు బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఆ తర్వాత చాలా రోజుల పాటు బాలయ్య కెరీర్‌కు మంచి ఊపు నిచ్చింది. హైదరాబాదులోని సుభాష్ – శ్రీనివాస థియేటర్ల‌తో పాటు మరో థియేటర్ లో కూడా 365 రోజులు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ సినిమాలతోపాటు ఏఎన్నార్ సినిమాలు 365 రోజులు ఆడినా… ఒకే కేంద్రంలో మూడు థియేటర్లలో సంవత్సరం పాటు ఏ సినిమా ఆడలేదు. ఈ చెక్కుచెదరని ప్ర‌పంచ‌ రికార్డు ఒక్క బాలయ్యకే సొంతం అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news