Moviesవిక్ట‌రీ వెంక‌టేష్ ' గ‌ణేష్ ' సినిమా వెన‌క ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు..!

విక్ట‌రీ వెంక‌టేష్ ‘ గ‌ణేష్ ‘ సినిమా వెన‌క ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు..!

సామాజిక సమస్యల మీద సినిమాలు దొరకటం చాలా అరుదుగా జరుగుతుంది. అందులోనూ స్టార్ హీరోలు చాలా రిస్క్ చేసి ఇలాంటి కథల్లో నటించేందుకు పెద్దగా ఇష్టపడరు. ఒకవేళ నటించినా ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవుతుంది అన్న నమ్మకాలు తక్కువుగా ఉంటాయి. అయితే ఇలాంటి అనుమానాలు పటాపంచలు చేస్తూ సూపర్ హిట్ అయిన సినిమా విక్టరీ వెంకటేష్ గణేష్. 1998లో రిలీజైన ఈ సినిమా విక్టరీ వెంకటేష్ కు నంది అవార్డు తెచ్చిపెట్టింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించారు. అప్పట్లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఒకేసారి రెండు… మూడు సినిమాలు నిర్మాణంలో ఉండేవి. ఇటు గణేష్ నిర్మాణ వ్యవహారాలు సురేష్ బాబు పర్యవేక్షించారు. అదే సమయంలో రాజ‌శేఖ‌ర్ హీరోగా వ‌చ్చిన శివ‌య్య‌ సినిమా కూడా ఇదే బ్యానర్లో తెరకెక్కుతోంది. ఆ సినిమాను రామానాయుడు పర్యవేక్షించారు.

అంతకుముందు వెంకటేష్ హీరోగా వచ్చిన ప్రేమ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సురేష్ కృష్ణ అసిస్టెంట్ తిరుపతి స్వామి ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. సురేష్ కృష్ణ సిఫార్సుతో తిరుపతి స్వామి సురేష్ బాబుకు కథ చెప్పేందుకు వెళ్లారు. సురేష్ బాబు ఓకే అనే వరకు ఎన్ని కథలు అయినా చెబుతానని తిరుపతి స్వామి పంతం పట్టారు. అయితే ఆయన చెప్పిన మొదటి కథే సురేష్ బాబును మెస్మరైజ్ చేసింది. సమాజంలో పేరుకుపోయిన మెడికల్ మాఫియా కుట్రలను ఒక జర్నలిస్ట్ ఎలా ? చేధించాడు అన్న కథాంశంతో ఈ సినిమా కథను రాసుకున్నారు.

తిరుపతి స్వామి స్వతహాగా జర్నలిస్టు, అభ్యుదయవాది. తన వృత్తి పరంగా తన కళ్ళముందు జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ కథను రాసుకున్నారు. మెడికల్ మాఫియా దందాను నడిపిస్తున్న ఆరోగ్య శాఖ మంత్రికి ఎదురు వెళ్లి తన కుటుంబాన్ని ఎలా బలి చేసుకున్నాడు ? అన్న కథాంశంతో గణేష్ సినిమా తెరకెక్కింది. అప్పట్లో మంచి ఫామ్‌లో ఉన్న రంభ‌ను హీరోయిన్ గా తీసుకున్నారు. అలాగే మరో కీలకమైన పాత్రకు అల్లరి ప్రియుడు, రోజా హీరోయిన్ మ‌ధుబాల‌ను ఎంపిక చేసుకోగా వెంకటేష్ ప్రేమ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రేవతిని మరో చిన్న పాత్రకు తీసుకున్నారు.

శత్రువు సినిమా తర్వాత ఆ స్థాయిలో కోట శ్రీనివాసరావు పండించిన విల‌నిజం సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ప్రభుత్వ ఆసుపత్రిల్లో దుస్థితి ఎలా ఉంటుందో తిరుపతి స్వామి కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇక ఫ్లాష్‌బ్యాక్‌లో తిరుపతి స్వామి గుండెలు పిండేసే సీన్లను చిత్రీకరించారు. మణి శర్మ పాటలు అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో తెలుగులో భారతీయుడు – జెంటిల్మెన్ సినిమాలు రావడం లేదని బాధ పడుతున్న సినీ ప్రేమికుల ఆక‌లి గణేష్ తీర్చింది. సామాజిక సందేశంతో వచ్చిన గణేష్ కమర్షియల్‌గా బ్లాక్బస్టర్ హిట్ కావడంతో పాటు ఎన్నో అవార్డులను.. రివార్డులను సొంతం చేసుకుంది.

ఇక క్లైమాక్స్ లో వెంకటేష్ నటనతో పాటు పరుచూరి బ్రదర్స్ డైలాగులు… తిరుపతి స్వామి టేకింగ్ ప్రేక్ష‌కుల‌ చేత చప్పట్లు కొట్టించుకుని అప్పట్లో ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. ఉత్తమ నటుడిగా వెంకటేష్ – ఉత్తమ విలన్ కోట శ్రీనివాసరావు – ఉత్త‌మ డైలాగ్స్ రైటర్లుగా పరుచూరి సోదరులు – ఉత్తమ తృతీయ సినిమాగా గణేష్‌కు నంది అవార్డులు వచ్చాయి. ఆ టైంలో తాను చేసిన గొప్ప సినిమాల్లో గణేష్ ఒక‌ట‌ని వెంకటేష్ చెప్పారు.

ఈ సినిమా తర్వాత తిరుపతి స్వామి నాగార్జునతో అశ్వనీదత్ నిర్మించిన అజాద్ సినిమాతో పాటు విజయ్ కాంత్ హీరోగా తమిళంలో నరసింహ ( తెలుగులో టైటిల్ సెల్యూట్ ) చేశాక రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం దురదృష్టకరం. అవన్నీ కూడా సామాజిక స్పృహ‌తో తెరకెక్కిన సినిమాలు కావ‌డం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news