కేసీఆర్ త‌న ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్‌ను క‌రుణిస్తారా… అగ‌మ్య‌గోచ‌రంగా వాళ్ల ఫ్యూచ‌ర్‌..?

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అత్యంత ఆప్త‌మిత్రులుగా ఉన్న ముగ్గురు కీల‌క నేత‌ల రాజ‌కీయ భ‌విత‌వ్యం అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. తొలి విడ‌త ప్ర‌భుత్వంలో కీ రోల్ పోషించిన ఆ నేత‌ల‌ను ఇప్పుడు పార్టీలో నామ‌మాత్రంగా కూడా త‌లిచేవారు లేకుండా పోయారు. ఆ మాట‌కు వ‌స్తే తొలి విడ‌త ప్రభుత్వంలో వారు న‌క్క తోక తొక్కి మ‌రీ కీల‌క ప‌ద‌వులు అధిరోహించారు. ఇప్పుడు వారిని కేసీఆర్ కూడా ప‌ట్టించుకోవ‌డం లేదా ? వారి రాజ‌కీయ భ‌విత‌వ్యం ఏంటో కూడా అర్థం కాని ప‌రిస్థితి.

 

ఇంత‌కు ఆ ముగ్గురు నేత‌లు ఎవ‌రో కాదు కేసీఆర్‌తో స‌రిస‌మానంగా కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయం చేయ‌డంతో పాటు ఆయ‌న‌తోనే ఉంటోన్న తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి కాగా, మాజీ అసెంబ్లీ స్పీక‌ర్ మ‌ధుసూద‌న‌చారి, ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల‌ను రెండు ద‌శాబ్దాల పాటు శాసించిన మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు. వీరిలో క‌డియం 2014 ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ ఎంపీగా విజ‌యం సాధించారు. త‌ర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్య‌ను త‌ప్పించిన కేసీఆర్ కడియంను ఎమ్మెల్సీని చేసి మ‌రీ మంత్రిని చేశారు. త‌ర్వాత 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఎమ్మెల్యే సీటు ఇవ్వ‌లేదు.. త‌ర్వాత ఎంపీ సీటు ఇవ్వ‌లేదు.. ఇప్పుడు ఆయ‌న్ను పూర్తిగా సైడ్ చేసేశారు.

 

ఇక తుమ్మ‌ల విష‌యానికి వ‌స్తే టీడీపీ నుంచి ఓడిపోయిన ఆయ‌న్ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. ఆ త‌ర్వాత తుమ్మ‌ల పాలేరు ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. ఇక 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో తుమ్మ‌ల ఉపేంద‌ర్‌రెడ్డి చేతిలో ఓడిపోవ‌డం.. అటు ఉపేంద‌ర్ కూడా టీఆర్ఎస్‌లోకి రావ‌డంతో పాటు ప్ర‌స్తుతం ఖ‌మ్మం రాజ‌కీయాల్లో మంత్రి పువ్వాడ అజ‌య్ హ‌వా కొన‌సాగుతుండ‌డంతో తుమ్మ‌ల రాజ‌కీయంగా వెన‌క‌ప‌డిపోయారు. ఇక తెలంగాణ తొలి స్పీక‌ర్‌గా ప‌నిచేసిన మ‌ధుసూద‌నాచారి స్పీక‌ర్ ఉండి భూపాల‌ప‌ల్లిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌పై గెలిచిన గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి కూడా టీఆర్ఎస్‌లోకి వ‌చ్చేశారు.

 

దీంతో ఈ ముగ్గురు కీల‌క నేత‌ల మాట‌, ఊసే ఇప్పుడు లేకుండా పోయింది. మ‌రి కేసీఆర్ వీరిని ప‌ట్టించుకుంటారా ? వీరికి తెలంగాణ రాజ‌కీయాల్లో భ‌విష్య‌త్తు ఉందా ? వీరి భ‌విత‌వ్యం ఏంటో కాల‌మే స‌మాధానం చెప్పాలి.

Leave a comment