Moviesతారక్ - చర‌ణ్ ఫ‌స్ట్ స్నేహం ఎక్క‌డ చిగురించిందంటే..!

తారక్ – చర‌ణ్ ఫ‌స్ట్ స్నేహం ఎక్క‌డ చిగురించిందంటే..!

టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా తెర‌కెక్కిన భారీ ప్ర‌తిష్టాత‌క సినిమా త్రిబుల్ ఆర్‌. అస‌లు ఈ సినిమా ప్ర‌క‌టించిన‌ప్పుడు ఇండ‌స్ట్రీయే షాక్ అయ్యింది. టాలీవుడ్‌లో మెగా, నంద‌మూరి కుటుంబాలు రెండూ కూడా వేర్వేరు భిన్న ధృవాల‌కు చెందిన కాంపౌండ్లు. ఈ రెండు కాంపౌండ్ల‌కు చెందిన హీరోల సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రిలీజ్ అవుతున్నాయి అంటేనే బాక్సాఫీస్ వార్ మామూలుగా ఉండ‌దు. ఈ పోరు ఇప్ప‌టి నుంచి కాదు.. 1990వ ద‌శ‌కంలో బాల‌య్య‌, చిరు సినిమాల నుంచి కూడా న‌డుస్తూనే ఉంది. ఆ త‌ర్వాత త‌రంలోనూ ఇదే వార్ ఉంది.

అలాంటి టైంలో మూడేళ్ల క్రితం ఎన్టీఆర్ – చ‌ర‌ణ్ కాంబోలో త్రిబుల్ ఆర్ సినిమా ప్ర‌క‌టించిన‌ప్పుడు అంద‌రూ వామ్మే రాజ‌మౌళి ఏం గ్రేట్ కాంబినేష‌న్ సెట్ చేశాడ్రా బాబు అని అవాక్క‌య్యారు. క‌రోనా లేక‌పోయి ఉంటే ఈ పాటికే ఈ సినిమా రిలీజ్ అయ్యి.. దీని రిజ‌ల్ట్ ఏంటో వ‌చ్చేసి ఉండేది. ప‌లుసార్లు వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌చ్చిన ఈ సినిమా ఎట్ట‌కేల‌కు ఈ నెల 25న థియేట‌ర్ల‌లోకి దిగుతోంది.

ప్ర‌మోష‌న్ల విష‌యంలో చ‌ర‌ణ్‌, తార‌క్ ఇద్ద‌రూ దూకుడుగానే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే చ‌ర‌ణ్‌, తార‌క్‌, రాజ‌మౌళి ముగ్గురూ క‌లిసే ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొంటున్నారు. చెన్నై అయినా, ముంబై, హైద‌రాబాద్‌.. అటు బెంగ‌ళూరు అయినా ఈ ముగ్గురు క‌లిసే ప్ర‌మోష‌న్ల‌ను హోరెత్తిస్తున్నారు. అయితే వీరిద్ద‌రి స్నేహం ఈ సినిమా టైంలోనే చిగురించి ఉండొచ్చు అని చాలా మంది అనుకుంటారు. అయితే ఇప్పుడు కాదు.. ఎప్ప‌టి నుంచో వీరు బెస్ట్ ఫ్రెండ్స్ అట‌. ఈ విషయాన్ని తార‌క్ స్వ‌యంగా చెప్పాడు.

త‌మ స్నేహం ఏళ్ల నాటిది అని తార‌క్ – చ‌ర‌ణ్ ఇద్ద‌రూ చెప్పారు. గ‌తంలో ఇండ‌స్ట్రీ వాళ్లు అంతా క‌లిసి క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేశారు. ఆ టైంలోనే వీరు స్నేహితులు అయ్యార‌ట‌. అప్ప‌టి నుంచి తాము బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నామ‌ని చెప్పిన తార‌క్ మ‌రో ట్విస్ట్ కూడా ఇచ్చాడు. తార‌క్ భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి పుట్టిన రోజు మార్చి 26. ఆ త‌ర్వాత మార్చి 27 చ‌ర‌ణ్ బ‌ర్త్ డే.

ప్ర‌ణ‌తి బ‌ర్త్ డే రోజు టైం 12 గంట‌లు కొట్టిన వెంట‌నే తారక్ కారేసుకుని వెళ్లి చ‌ర‌ణ్ ఇంటిముందు నిల‌బ‌డేవాడ‌ట‌. త‌ర్వాత కారేసుకుని అంతా బ‌య‌ట‌కు వెళుతూ ఉంటామ‌ని తార‌క్ చెప్పాడు. ఇక త‌మ ఇద్ద‌రి ఇళ్లు కూడా వాకింగ్ డిస్టెన్స్ దూరంలోనే ఉంటాయ‌ని తార‌క్ చెప్పాడు. గ‌తంలో తార‌క్ కుటుంబం, చ‌ర‌ణ్ కుటుంబం క‌లిసి ఒకే పార్టీలో పాల్గొన్నారు కూడా..! ఈ పార్టీలో చ‌ర‌ణ్‌, తార‌క్ ఇద్ద‌రితో పాటు ప్ర‌ణ‌తి, ఉపాస‌న మాత్ర‌మే ఉన్నారు.

ఇక స్టార్ క్రికెట్ టైం నుంచే తాము చాలా క్లోజ్ అయిపోయామ‌ని చెప్పిన తార‌క్‌.. తాను కాస్త దూకుడుగా ఉంటే.. చ‌ర‌ణ్ చాలా ప్ర‌శాంతంగా ఉంటాడ‌ని.. ఈ స్వ‌భావాలే త‌మ‌ను మ‌రింత ద‌గ్గ‌ర చేశామ‌ని చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news