Moviesలెక్క‌లేన‌ని కాంట్ర‌వ‌ర్సీలు, నాలుగేళ్ళ‌ షూటింగ్‌.. ఎన్టీఆర్‌, బాల‌య్య కాంబినేష‌న్‌లో బిగెస్ట్ బ్లాక్...

లెక్క‌లేన‌ని కాంట్ర‌వ‌ర్సీలు, నాలుగేళ్ళ‌ షూటింగ్‌.. ఎన్టీఆర్‌, బాల‌య్య కాంబినేష‌న్‌లో బిగెస్ట్ బ్లాక్ బాస్ట‌ర్ సినిమా..!

నట సౌర్వభౌమ నటరత్న ఎన్టీఆర్, ఆయన తనయుడు నటసింహం యువరత్న నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. బాలకృష్ణ కెరీర్ ప్రారంభంలో ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించారు. అందులోనే బాలకృష్ణ – ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కొన్ని. ఆ సినిమాలలో ఎన్టీఆర్ పవిత్ర సంకల్పంతో నిర్మించిన సినిమా శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా. ఎన్టీఆర్ ఎంతో పట్టుదలతో ఈ సినిమాను తెరకెక్కించారు. 1980 ఈ సినిమా నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

ఏడాది పాటు గ్యాప్ లేకుండా షూటింగ్ జరిగింది. బ్రహ్మంగారు తన జీవితకాలంలో పర్యటించిన ప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్ జరగటం విశేషం. రాయలసీమలోని కందిమల్లయ్య ప‌ళ్లి – అహోబిలం తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ కొనసాగింది. ఈ సినిమా కోసం ముందుగా ఎన్టీఆర్ బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించారు. ఆయన వినియోగించిన వస్తువులను, పాదుకులను పరిశీలించారు. అటువంటి వాటినే తయారు చేయించారు. ఆ తర్వాత ముమ్మిడివరం బాలయోగి మందిరం పరిసరాల్లో కూడా షూటింగ్ జరిపారు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి.

సెన్సార్ బోర్డ్‌ కీలకమైన అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. ఎన్టీఆర్ మూడేళ్లపాటు న్యాయపోరాటం చేశారు. ఎన్నో ఇబ్బందులు అధిగమించి ఈ సినిమా 1984 నవంబర్ 29న విడుదలై బాక్సాఫీస్ దగ్గర అఖండ విజయం సాధించి.. ఆ రోజుల్లోనే ఏడు కోట్ల షేర్ రాబట్టింది. హైదరాబాద్‌లో 300 రోజులు ఆడింది. స్లాబ్ విధానంలో ఇదో సరికొత్త రికార్డుగా నిలిచిపోయింది. వీరబ్రహ్మేంద్రస్వామి జీవితములో బాల్య‌, కౌమార.. యవ్వన, వృద్ధాప్యాలను దర్శకుడు ఎన్టీఆర్ వెండితెరపై ఆవిష్కరించిన విధానం అనితర సాధ్యం అని చెప్పక తప్పదు.

ఈ సినిమా నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు ఎన్టీఆర్ సోదరుడు నందమూరి త్రివిక్రమరావు పర్యవేక్షణ చేశారు. కొండవీటి వెంకటకవి రచన చాతుర్యం, సోసర్ల దక్షిణామూర్తి సంగీత సౌరవ భావం, నందమూరి మోహనకృష్ణ సినిమాటోగ్రఫీ.. ఈ సినిమాకు వన్నె తెచ్చాయి. బుద్ధుడు, రామానుజచార్య, ఆదిశంకరాచార్య, వేమన వంటి మహాపురుషుల వేషాలతో ఎన్టీఆర్ ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తారు. వారి సరసన వీరబ్రహ్మేంద్రస్వామి వారికి కూడా ఈ సినిమాతో చోటు కల్పించారు. చారిత్రాత్మక సినిమాలలో శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తలమానికం అని చెప్పకతప్పదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news