News"ముహూర్తం లేదు.. ముల‌క్కాయ లేదు..అలాంటి పనులు చేయచ్చు"..అక్కినేని నాగేశ్వర రావులో ఈ...

“ముహూర్తం లేదు.. ముల‌క్కాయ లేదు..అలాంటి పనులు చేయచ్చు”..అక్కినేని నాగేశ్వర రావులో ఈ యాంగిల్ కూడా ఉందా..?

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అంటే.. పెద్ద‌గా దేవుడిని న‌మ్మేవారు కాదు. అంతేకాదు.. ముహూర్తాలు చూసుకుని సినిమాలు ప్రారంభిస్తామంటే కూడా.. ఆయ‌న చిరాకు ప‌డేవారు. ముహూర్తాలేంట‌య్యా ముహూర్తాలు.. అలాతీసిన సినిమాలు అన్నీ ఆడాయా? ముహూర్తం లేదు.. ముల‌క్కాయ లేదు. అని చిరాకు ప్ర‌ద‌ర్శించిన సంద‌ర్భాలు అనేకం ఉండేవి. అదేస‌మ‌యంలో అక్కినేనికి సెంటిమెంటు కూడా లేదు. ఆదివారం, అమావాస్య వంటి సెంటిమెంట్లు పెట్టుకునేవారు కాదు.

మ‌నం ఆరోగ్యంగా ఉన్నామా? నిర్మాత సౌఖ్యంగా ఉన్నారా? అనేది చూసుకునేవారు. అంద‌రికీ ఇదే చెప్పేవారు. అంత‌కుమించి ముహూర్తాలు చూసుకుని.. షూటింగులు ప్రారంభిస్తామంటే.. ఆయ‌న ఒకింత చిరాకు ప్ర‌ద‌ర్శించేవారు. బాపు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, లత, నాగభూషణం తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన అందాల రాముడు సినిమా విష‌యంలోనూ ఇలానే జ‌రిగింది. ఈ సినిమాను ఎన్‌.ఎస్ మూర్తి నిర్మాత‌గా మారి రూపొందించారు.

మూర్తి.. ప‌క్కా ముహూర్తాలు చూసుకునేవారు. కానీ, బాపు, అక్కినేనిలు ఇద్ద‌రిదీ దాదాపు ఒకే మ‌న‌స్తత్వం. దీంతో వారు ముహూర్తాలు ప‌ట్టించుకునేవారు కాదు. అందాల రాముడు విష‌యంలోనూ అక్కినేని ముహూర్తం అక్క‌ర‌లేదు.. ఏదో ఒక రోజు ఫిక్స్ చేయండి.. వ‌చ్చేస్తాను… స్టార్ట్ చేసేద్దాం అన్నారు. కానీ, అది శూన్య‌మాసం(వినాయ‌క‌చ‌వితి జ‌రిగే రోజులు). దీంతో మూర్తి ఇష్ట‌ప‌డ‌లేదు. ఈ విష‌యం బాపు ద‌గ్గ‌ర ప్ర‌స్తావించారు. ఆయ‌న అక్కినేనికి చెప్పి.. ఓ నెల వాయిదా వేద్దామ‌న్నారు.

దీనికి అక్కినేని ఒప్పుకోలేదు. మీకు న‌ష్టం వ‌స్తే.. నాదీ బాధ్య‌త. ముందు షూటింగ్ ప్రారంభించండి అని హామీఇచ్చారు. ఇలా.. 1973లో వ‌చ్చిన ఈ సినిమాకు ఎలాంటి ముహూర్తాలు చూసుకోలేదు. కానీ. సూప‌ర్ హిట్ కొట్టింది. మహదేవన్ సంగీతంలో వ‌చ్చిన‌ పాటలన్నీ హిట్టే. నిజానికి తొలి వారం రోజులు ప్రేక్షకులు సరిగా ఆదరించలేదు. దీంతో ఇది ముహూర్తం ఎఫెక్టే అనుకున్నారు. కానీ, త‌ర్వాత త‌ర్వాత‌.. సూప‌ర్ హిట్ టాక్ రావ‌డ‌మే కాదు.. ఉమ్మ‌డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ద్వితీయ చిత్రంగా రజిత నంది అవార్డు ప్రకటించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news