Politicsపేట‌లో సీన్ రివ‌ర్స్‌... ' ప్ర‌త్తిపాటి ' వైపే చూస్తున్నారా..!

పేట‌లో సీన్ రివ‌ర్స్‌… ‘ ప్ర‌త్తిపాటి ‘ వైపే చూస్తున్నారా..!

ప్రత్తిపాటి పుల్లారావు…ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిన ప్రత్తిపాటి..చంద్రబాబు సపోర్ట్‌తో తొలిసారి 1999 ఎన్నికల్లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదేళ్ల పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా పేటలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పుల్లారావు 2004 ఎన్నికల్లో గెలుపు అంచుల వరకు వచ్చి బోల్తా కొట్టారు. కేవలం 212 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి వేవ్ నాడు స‌మైక్య రాష్ట్రాన్ని ఊపేసిన‌ప్పుడు పుల్లారావు 212 ఓట్ల‌తో ఓడారంటే ఆయ‌న ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో తెలుస్తోంది.

 

అయితే 2009లో మళ్ళీ పుంజుకుని విజయం సాధించిన ప్రత్తిపాటి నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ప‌ట్టు ఫ్రూవ్ చేసుకున్నారు. వైఎస్ రెండోసారి అధికారంలోకి వ‌చ్చినా, మ‌రోసారి ప్ర‌జారాజ్యం పోటీలో ఉన్నా కూడా ప్ర‌త్తిపాటి 17 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో పేట నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి కూడా అయ్యారు. గుంటూరు జిల్లా నుంచి టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఐదేళ్ల పాటు పూర్తికాలం మంత్రిగా ప‌నిచేసిన ఘ‌న‌త పుల్లారావుకే ద‌క్కింది. ఇక మంత్రిగా తనకు కేటాయించిన శాఖలని సమర్ధవంతంగా నడుపుతూనే, పేట అభివృద్ధికి తీవ్రంగా కృషి చేశారు. నియోజకవర్గంలో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలకు చెక్ పెట్టారు. తాగునీటి, సాగునీటి సమస్యలు లేకుండా చూసుకున్నారు.

రోడ్లు, అండర్ డ్రైనేజ్‌లు, కొత్తగా పాఠశాలలు, అంగన్‌వాడీలు, వాటర్ ట్యాంకులు నిర్మించారు. అనేక రకాలుగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించారు. పేద‌ల‌కు పేట‌లో పుల్లారావు కట్టించిన ఇళ్లు పేట నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌లోనూ ఎప్పుడూ ఎవ్వ‌రూ క‌ట్ట‌లేదు. ఈ రకంగా పేట ప్రజలకు మేలు చేసినా కూడా…2019 ఎన్నికల్లో పుల్లారావు జగన్ వేవ్‌లో ఓటమి పాలవాల్సి వచ్చింది. అయితే ఓటమి వచ్చినా కూడా ప్రత్తిపాటి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పేట ప్రజలకు అండగా నిలబడుతున్నారు. అధికారంలో లేకపోయినా సరే పేట నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు.

 

అటు నియోజకవర్గంలో జరుగుతున్న తాజా పరిణామాలతో ప్రజలు…మళ్ళీ ప్రత్తిపాటి వైపు చూస్తున్నారు. ఆయన ఓటమి వల్ల పేట అభివృద్ధి కుంటుపడిందని భావిస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ప్రత్తిపాటిని గెలిపించుకోవాలని పేట ప్రజలు ఆరాటపడుతున్నారు. టీడీపీ కేడర్ సైతం పుంజుకుని నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేస్తున్నారు. పైగా అమరావతి ప్రభావం కూడా పేట ప్రజలపై బాగా ఉంది. అమరావతికి అతి దగ్గరలో ఉన్న పేట వాసులు మూడు రాజధానులని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక ఈ పరిణామాలన్నీ ప్రత్తిపాటికి బాగా కలిసోస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news