సాధారణంగా.. 35 ఏళ్ల వయసు అనగానే.. హీరో పాత్రలకే పరిమితం అవుతారు. ఎక్కడో అరుదుగా మాత్రమే పెద్ద పెద్ద క్యారెక్టర్ పాత్రలు వేస్తారు. కానీ.. అన్నగారు భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా నటించేవారు. ఏ పాత్ర వచ్చినా.. దానిని సవాలుగా తీసుకునేవారు. ఎక్కడా వెనుకాడేవారు కాదు. తొలి నాళ్ల నుంచే అనేక ప్రయోగాలు చేశారు.
ఇలాంటి వాటిలో భీష్మ సినిమా ఒకటి. ఈ సినిమా సమయానికి అన్నగారి వయసు 35-36 మధ్య ఉంటాయి.
అయితే.. అనూహ్యంగా ఆయనను భీష్మ సినిమాకు ఒప్పించారు దర్శక, నిర్మాత చక్రపాణి. ఈ సినిమాలో యువకుడిగా ఉన్న భీష్మ పాత్ర నుంచి కురువృద్ధుడు అయ్యే భీష్మ పాత్ర వరకు ఎన్టీఆర్ నటించారు. సినిమా అద్భుతంగా వచ్చింది. రషెస్ బాగున్నాయి.
కానీ, అనుకున్నంతగా అయితే.. వసూళ్లు రాబట్టలేక పోయింది. కానీ, ఈ సినిమా అన్నగారిలోని భిన్నమైన అనేక కోణాలను ప్రేక్షకులకు పరిచయం చేసింది. అదికూడా.. అత్యంత పిన్న వయసులోనే అన్నగారు వృద్ధుడిగా నటించడంపై నిజానికి అప్పటి అభిమానులు జీర్ణించుకుంటారా ? అనే సందేహాలు వచ్చాయి. ఇదే విషయాన్ని రామారావు.. చాలా మందిని అడిగారు.
నన్ను వృద్ధుడిగా ప్రేక్షకులు.. రిసీవ్ చేసుకుంటారా ? అనేవారు. కానీ, ఎక్కువ మంది మాత్రం కష్టమే అన్నారు. అయితే.. సినిమాలో అన్నగారి యాక్షన్ చూసిన తర్వాత.. అలా అన్నవారే.. మీలో చాలా టాలెంట్ ఉందని మెచ్చుకున్నారు. అభిమానులు కూడా ఆయన నటనకు ఫిదా అయ్యారు.