హైదరాబాద్‌లోని కాచీగూడలో ఉన్న తారకరామా 70 ఎంఎం థియేటర్ పునః ప్రారంభిస్తున్నారు. దివంగత ఎన్టీఆర్ తనకంటూ హైదరాబాద్‌లో మంచి థియేటర్ ఉండాలన్న కోరికతో ఈ థియేటర్‌ను ఆయనే నిర్మించారు. అప్పట్లో మంగమ్మగారి మనవడులాంటి సినిమాలు ఇక్కడ సెంచరీలు కొట్టాయి. ఆ తర్వాత కూడా ఎన్నో విజయవంతమైన సినిమాలు ఈ థియేటర్లలో ప్రదర్శించారు. ఎన్టీఆర్, బాలకృష్ణ సినిమాలకు ఇది అడ్డాగా ఉండేది.
ఎన్టీఆర్ మరణం తర్వాత ఈ థియేటర్‌ను ఆయన వారసులు పట్టించుకోలేదు. ఎవరికో లీజుకు ఇవ్వడంతో ఈ సినిమా చివరకు బూతు సినిమాలకు అడ్డాగా మారిపోయింది. అయితే ఇప్పుడు బాలయ్య రంగంలోకి దిగి ఈ థియేటర్‌ను ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా రెన్నోవేట్ చేశారు. అసలు తారకరామా మొత్తం సిట్టింగ్ కెపాసిటీ 975. అయితే ఇప్పుడు సిట్టింగ్‌ను కుదించి 590కు తగ్గించారు. ఇందులో రిక్లైనర్లతో పాటు సోఫాలను కూడా అందుబాటులోకి తెచ్చారు.
ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో ప్రముఖ ఫైనాన్షియర్ నారాయణదాస్ నారంగ్ ఈ థియేటర్‌ను రెన్నోవేట్ చేసి తిరిగి ప్రేక్షకులకు అందుబాటులోకి తేవాలని సంకల్పించారు. ఆయన మరణాంతరం ఆయన తనయుడు ఏషియన్ గ్రూప్స్ థియేటర్స్ అధినేత సునీల్, సురేష్‌బాబు కలిసి ఈ థియేటర్‌ను రెన్నోవేట్ చేయించారు. 4కే ప్రొడక్షన్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్‌తో పాటు, సిట్టింగ్‌ను తగ్గించి ఆధునిక హంగులు కల్పించారు.
ఈ థియేటర్‌ను పునః ప్రారంభించేలా చేయడంలో బాలకృష్ణ బాగా చొరవ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆసియన్ సునీల్‌తో పాటు సురేష్‌బాబు, సదానంద్ గౌడ్ బాలయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాలయ్య చేతుల మీదుగానే ఈ థియేటర్ పునః ప్రారంభమవుతోంది. ఈ నెల 16 నుంచి అవతార్ 2ను ఇక్కడ ప్రదర్శించనున్నారు.