నందమూరి నట సింహం బాలకృష్ణ ఆల్రౌండర్. బాలయ్యలో ఓ నటుడు మాత్రమే కాదు.. మంచి కథా రచయిత ఉన్నాడు. అలాగే బాలయ్యలో ఎవరికీ తెలియని దర్శకుడు కూడా దాగి ఉన్నాడు. తన తండ్రి ఎన్టీఆర్ నుంచి బాలయ్య నటనతో పాటు దర్శకత్వంలోని మెళకువలు కూడా అందిపుచ్చుకున్నాడు. బాలయ్య తన కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా ఎన్టీఆర్ తో కలిసి నటించారు. అందులో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. అందుకే దర్శకత్వం ఎలా ? చేయాలి అన్నదానిపై బాలయ్యకు తన కెరీర్ ప్రారంభం నుంచే మంచి అవగాహన ఉంది.
అందుకే తన స్వీయ దర్శకత్వంలో నర్తనశాల సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. అయితే ఆ సినిమాలో ద్రౌపది పాత్ర పోషించిన దివంగత నటి సౌందర్య అకస్మాత్తుగా మృతి చెందడంతో నర్తనశాల మధ్యలోనే ఆగిపోయింది. అలా బాలయ్య డైరెక్ట్ చేసిన సినిమా రిలీజ్ కాకుండా మధ్యలోనే ఆగిపోయింది. గత ఏడాది ఈ సినిమాలో షూటింగ్ జరిగిన సీన్లను ఎడిట్ చేసి ఓటిటిలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే బాలయ్య అంతకుముందే ఒక సినిమాకు కో డైరెక్టర్ గా పనిచేశారు. ఈ విషయం చాలామందికి తెలియదు. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాకు దర్శకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక.. ఆయనకు విశ్వామిత్రుడి పాత్రలో నటించాలన్న కోరిక బలంగా వచ్చేసింది. అంతకుముందు 10 ఏళ్లుగా విశ్వామిత్రుడు పాత్రలో నటించాలని ఆయన కోరుకునేవారు. 1989 జనవరి 15న తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రారంభోత్సవం జరుపుకుంది.
ఈ సినిమాలో కీలకమైన మేనక పాత్ర కోసం చాలామంది హీరోయిన్ల పేర్లు పరిశీలించి… బాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రిని ఎంపిక చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పతాకంపై తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రూపొందింది. ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించగా… ఆయన కుమారుడు బాలకృష్ణ హరిచంద్రుడు, దుష్యంతుడు పాత్రలలో కనిపిస్తారు. 1989 జూన్ 18న హైదరాబాద్లోని నాచారంలో ఈ సినిమా షూటింగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఎంతోమంది సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. ఎన్టీఆర్ – మీనాక్షి శేషాద్రి పై తొలి షాట్ చిత్రీకరించారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఎన్టీఆర్ తిరిగి నట జీవితం ప్రారంభించడంతో ఈ సినిమాకు ఎక్కడా లేని ప్రాధాన్యం లభించింది. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వం వహించగా బాలకృష్ణ కో డైరెక్టర్ గా వ్యవహరించారు.
బాలకృష్ణ కూడా ఈ సినిమా కథ. రచన పర్యవేక్షణలో తన వంతుగా సాయం అందించారు. భారీ అంచనాల నడుమ 1991 ఏప్రిల్ 18న ఈ సినిమా విడుదలైంది. అయితే బ్రహ్మర్షి విశ్వామిత్ర ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో అలరించలేకపోయింది. ఎన్టీఆర్ సతీమణి శ్రీమతి బసవతారకం స్మృతికి చిహ్నంగా ఆమెకు ఈ సినిమాను అంకితం ఇచ్చారు. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఈ సినిమా హిందీ వెర్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించారు.
ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. శాకుంతల, దుష్యంతుడి కథలో వాస్తవికత లోపించడంతో పాటు మిగిలిన పౌరాణిక పాత్రల్లా విశ్వామిత్రుడి పాత్ర సామాన్య జనాలకు అంతగా కనెక్ట్ అయ్యి ఉండకపోవడం.. సినిమా అంచనాలు అందుకోలేకపోయినా బ్రహ్మర్షి విశ్వామిత్రుడిగా ఎన్టీఆర్ ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరు అమోఘం. ఇక నిర్మాణ విలువల్లోనూ ఎన్టీఆర్ ఎక్కడా రాజీపడలేదు.