టాలీవుడ్ లో రెండు దశాబ్దాల క్రితం యంగ్ హీరో ఉదయ్ కిరణ్ వరుస హిట్లుతో ఒక ఊపు ఊపేసాడు. వరుసగా చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే సూపర్ హిట్ అవడంతో ఉదయ్ కిరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పట్లో ఉదయ్ కిరణ్ కు యూత్ లో… అమ్మాయిల్లో పిచ్చ ఫాలోయింగ్ రావడంతో ఉదయ్ అమ్మాయిల కలల రాకుమారుడు అయిపోయాడు. ఉదయ్ కిరణ్ ని చూసి స్టార్ హీరోలు సైతం కంగారు పడ్డారు. ఎంత త్వరగా ఉదయ్ కిరణ్ లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడో అంతే త్వరగా తెరమరుగు అయిపోయాడు.
చివరకు ఆయన జీవితంతో విధి ఆడిన వింత నాటకంతో పోరాటం చేయలేక ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్లిపోయాడు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే సూపర్ హిట్ అయ్యాక అసలు ఉదయ్ కిరణ్ కాల్ సీట్లు సైతం దొరకని పరిస్థితి వచ్చేసింది. టాలీవుడ్ అగ్ర నిర్మాతలు అందరూ ఉదయ్‌తో సినిమా చేసేందుకు ఆయన వెంట పడ్డారు. ఉదయ్ కిరణ్ చిత్రం, నువ్వు నేను లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మూడో సినిమాగా `మనసంతా నువ్వేలో` నటించాడు.
ఆ సమయంలో స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారు. చిరంజీవికి మృగరాజు, మంజునాథ, డాడీ లాంటి సినిమాలు వచ్చాయి. ఇటు వెంకటేష్ కూడా `దేవి పుత్రుడు`, `ప్రేమతో రా` లాంటి ప్లాప్ సినిమాలతో ఉన్నారు. ఉదయ్ `మనసంతా నువ్వే` సినిమాను 2001 సెప్టెంబర్ రెండోవారంలో రిలీజ్ చేయాలని అనుకున్నారు నిర్మాత ఎంఎస్. రాజు. అయితే `నువ్వు నాకు నచ్చావ్` సినిమా సెప్టెంబర్ 6న విడుదలవుతుందని `మనసంతా నువ్వే`ని రెండు వారాలు వెనక్కి జరపాలని ఆ సినిమా నిర్మాతలు `మనసంత నువ్వే` సినిమా నిర్మాత ఎం. ఎస్. రాజును స్వయంగా అడిగారట.
దీంతో రాజు నో చెప్పకుండా సెప్టెంబర్ 20 లేదా 27న తన సినిమా రిలీజ్ చేస్తానని చెప్పారట. అయితే చిరంజీవి `డాడి` సినిమా అక్టోబర్ 4న రిలీజ్ అవుతోంది.. ఉదయ్ కిరణ్ సినిమా హిట్ అయితే డాడీ సినిమాకు ఇబ్బంది అవుతుందని భావించి డాడీ రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత `మనసంతా నువ్వే` రిలీజ్ చేయాలని కోరగా అందుకు కూడా ఎం. ఎస్. రాజు ఓకే అనక తప్పలేదట. డాడీ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాత. ఆయన మాటను రాజు కాదనే పరిస్థితి లేదు.
చివరకు నువ్వు నాకు నచ్చావ్, డాడీ రెండు సినిమాలు కంటే మనసంతా నువ్వే సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఎక్కువ వసూళ్లు సాధించింది. అలా అప్పట్లో ఉదయ్ కిరణ్ క్రేజ్ చూసి టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం కంగారు పడ్డారు.