మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. కెరీర్లోనే తొలిసారిగా చిరంజీవి, తనయుడు రామ్‌చరణ్ కలిసి నటించిన సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. చిరు రీ ఎంట్రీ ఇచ్చాక వరుసగా క్రేజీ కాంబినేషన్లు సెట్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఖైదీ నెంబర్ 150 – సైరా సినిమాల తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య చేశాడు.
చిరు – కొరటాల శివ కాంబినేషన్ ఇటు చెర్రీ కూడా సినిమాకు యాడ్ అవ్వడంతో మామూలు క్రేజ్ రాలేదు. పైగా మూడేళ్ల నుంచి ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం మెగాభిమానులకే మింగుడు పడడం లేదు. ఆచార్యకు వరల్డ్ వైడ్‌గా రు. 131 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాంలో అయితే ఏకంగా రు. 42 కోట్లకు రైట్స్ వరంగల్ శ్రీను సొంతం అయ్యాయి.
సినిమా ప్లాప్ టాక్‌తో ఆయనకే ఆ ఒక్క ఏరియాలోనే 50 శాతంకు పైగా నష్టాలు అంటే రు. 20 కోట్లు పోయినట్టే అంటున్నారు. దీంతో ఈ సినిమా మేకర్స్ త్వరగానే ఆచార్యను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసినట్టు ఉన్నారు. మహా అయితే ఆచార్య ఫైనల్ రన్ 10 రోజులకే ముగిసిపోయేలా ఉంది. దీంతో ఊహించిన దానికంటే ఆచార్య ఓటీటీలోకి వచ్చేస్తోంది.
ఆచార్య అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 20, 2022న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. కొణిదెల ఎంటర్టైన్మెంట్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. పూజా హెగ్డే, తనికెళ్ల భరణి, అజయ్, శత్రు కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ ఆచార్యకు సంగీతం అందించారు.