మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా అంచనాలను అందుకోలేదు సరికదా… మినిమం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోవటం సినిమా వర్గాలతోపాటు ట్రేడ్ వర్గాల్లో కలకలం రేపుతోంది. చిరంజీవి సినిమా అంటే ఓపెనింగ్స్ అదిరిపోతాయి. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా తొలిరోజు బాక్సాఫీస్ దగ్గర కుమ్మేస్తుంది. ఖైదీ నెంబర్ 150 సినిమా రీమేక్ అయినా కూడా తొలిరోజు బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రు. 55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
సైరా సినిమాకు కాస్త మిక్స్‌డ్ టాక్ వచ్చినా కూడా వంద కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టింది. ఆచార్య సినిమాలో చిరంజీవితో పాటు చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నాడు. అటు ప్లాప్ అన్న పదం ఎరుగని కొరటాల శివ దర్శకుడు. ఈ లెక్కన చూస్తే ఈ సినిమాకు తొలి రోజు ఓపెనింగ్స్ రు. 70 నుంచి 80 కోట్ల మధ్యలో ఉండాలి.
విచిత్రం ఏంటంటే తొలిరోజు మ్యాట్నీ నుంచే ఆచార్యకు ప్రేక్షకుల స్పందన కరువైంది. చాలామంది ఈ సినిమా చూసేందుకు ముందుగా టికెట్లు బుక్ చేసుకుని ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకున్నారు. రెండో రోజుకి కొన్ని థియేటర్ల నుంచి ఆచార్యను ఎత్తేశారు. చిరంజీవి లాంటి హీరో సినిమాకు రెండో రోజుకి థియేటర్లలో జనాలు లేకపోవడం టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పోనీ కరోనా తర్వాత ప్రేక్షకులకు సినిమా చూసే మూడ్ లేదు అనడానికి కూడా వీలు లేదు. అఖండ – పుష్ప – త్రిబుల్ ఆర్ – కేజిఎఫ్ లాంటి సినిమాలను బ్లాక్ బస్టర్ చేసింది ఈ ప్రేక్షకులే. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేందుకు… సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్ చేసేందుకు రెడీగా ఉన్నారు. అయితే వాళ్లకు ఏ సినిమా చూడాలి అన్న ? దానిపై క్లారిటీ ఉందని తెలుస్తోంది.
ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సినిమా బాగుందనే టాక్ వస్తేనే సినిమా చూసేందుకు వెళుతున్నారు. చిరంజీవి అయినా, రామ్‌చరణ్, చివరకు స్టార్ డైరెక్టర్ అయినా ప్రేక్షకులు లైట్ తీస్కొంటున్నారు. అసలు ఆచార్యపై ప్రేక్షకులు ముందు నుంచే ఓ ఒపీనియన్‌కు వచ్చేసినట్టున్నారు. అందుకే ఫస్ట్ డే కూడా చాలా థియేటర్లు నిండలేదు.
చిరు లాంటి హీరోకే ఈ పరిస్థితి ఉందంటే.. ఈ సమ్మర్‌లో మహేష్‌బాబు, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు కూడా తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి వీరి పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. సినిమా బాగుంటే ఓకే.. లేకపోతే అంతే సంగతులు..!