సౌత్ ఇండియన్ చార్లీ చాప్లిన్ సీకే నగేష్. ఈ పేరు వింటేనే అప్పట్లో చాలా మందికి మొముపై తెలియకుండా నవ్వు పుట్టేస్తుంది. తెలుగు సినిమాకు మాత్రమే కాదు.. సౌత్ ఇండియన్ సినిమాకే దొరికిన ఆణిముత్యం నగేష్. ఎన్నో సినిమాల్లో నటించి కమెడియన్‌గా మెప్పించిన నగేష్ కెరీర్ స్టార్టింగ్‌లో చాలా ఇబ్బందులు పడ్డాడు. కర్నాటకలోని తుముకూరు జిల్లాలో చెయ్యూరులో 1933 సెప్టెంబర్ 27న సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు. చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఆయనకు ఆసక్తి ఉండేది.
సినిమాల్లో నటించాలన్న కోరికతో మద్రాస్ వచ్చిన నగేష్ ఆ తర్వాత భారతీయ రైల్వేలో ఉద్యోగం కూడా చేశాడు. నాటకాల పట్ల ఆసక్తితో రంగస్థల నటుడిగా అవతారం ఎత్తి.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. నగేష్ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా సర్వర్ సుందరం. 1964లో విడుదల అయిన ఈ సినిమాలో ఆయన నటన అద్భుతం అనే చెప్పాలి. ఇక తెలుగులో ఆయన కమల్‌హాసన్ హీరోగా వచ్చిన దశావతారం సినిమాలో చివరిసారిగా కనిపించారు.
ఇక నగేష్ తన కెరీర్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా స్టార్ హీరోల ఇగోల మధ్య ఆయన నలిగిపోయారట. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడంతో నగేష్‌లో స్వతహాగా చాలా ధైర్యం ఉండేదట. ఆ ధైర్యంతోనే ఓ సారి నగేష్ ఎంజీఆర్ సెట్లోకి వచ్చినప్పుడు లేవకుండా కుర్చీలోనే ఉన్నారట. ఆ సంఘటనే నగేష్ జీవితాన్ని తల్లకిందులు చేయడంతో పాటు కష్టాల్లోకి నెట్టేసిందట. ఎంజీఆర్ తెరవెనక చేసిన రాజకీయంతో నగేష్‌కు ఎవ్వరూ అవకాశాలు ఇచ్చేవారు కాదట.
ఎంజీఆర్‌ను ఎదిరించే దమ్ము ఆ రోజుల్లో ఎవరికీ లేకపోవడంతో నగేష్‌కు ఛాన్సులు ఇచ్చేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. అయితే ఎన్టీఆర్ నగేష్ టాలెంట్ చూసి.. వరుసగా ఛాన్సులు ఇప్పించడంతో పాటు తన సినిమాల్లో కూడా ఛాన్సులు ఇచ్చారు. అలా ఎన్టీఆర్ సపోర్ట్ నగేష్‌కు ఉందన్న విషయం గ్రహించాకే ఎంజీఆర్ నగేష్‌పై కోపాన్ని తగ్గించారట. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నగేష్ చెప్పారు. తనలాంటి చిన్న నటుడిని ఎంజీఆర్ తొక్కేస్తే.. ఎన్టీఆర్ పైకి తీసుకువచ్చారని చెప్పారు.