నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా రిలీజ్ ఇప్పటికే నెలన్నర రోజులు దాటేసింది. బాలయ్య కు కలిసి వచ్చిన యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనాన్ని చూపిస్తుండటం ట్రేడ్ వర్గాలతో పాటు టాలీవుడ్ ను సైతం ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలకు లాంగ్‌రన్ రోజులు ఎప్పుడో పోయాయి.. ఎంత పెద్ద హిట్ సినిమా అయినా… ఎంత సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా మహా అయితే రెండు మూడు వారాలకు మించి థియేటర్లలో ఆడే పరిస్థితులు లేవు.
అయితే అఖండ మాత్రం ఓవైపు కరోనా భయాలు ఉన్నా… మరోవైపు ఏపీలో టికెట్ రేట్లు తగ్గించినా కూడా భారీ ఎత్తున వసూళ్లు రాబట్టింది. బాలయ్య కెరీర్లోనే రు. 150 కోట్ల క్లబ్ లో చేరిన తొలి సినిమాగా రికార్డులకు ఎక్కింది. డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయిన అఖండ సంక్రాంతికి వచ్చిన సినిమాల హవాను కూడా తట్టుకుని ఇప్పటికీ ఈ సినిమా ఆడుతున్న థియేటర్లలో హౌస్‌ఫుల్ ఆడుతోంది. సంక్రాంతికి హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అఖండకు బంగార్రాజు కంటే ఎక్కువ వసూళ్లు రావడం విశేషం.
అలాగే సంక్రాంతికి పెద్ద సినిమాలు లేకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రధాన నగరాల్లో హౌస్ ఫుల్ షోలు పడ్డాయి. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసలు ఒక సినిమా 50 రోజులు ఆడుతుందా ? అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ 50కి పైగా సెంటర్లలో అర్థశతదినోత్సవం జరుపుకోనుంది. విచిత్రమేంటంటే ఒక్క అనంతపురం జిల్లాలోనే ఈ సినిమా ఇంకా 10 సెంటర్లలో రన్ అవుతోంది.
పైగా సంక్రాంతికి అనంతపురం జిల్లాలో ఈ సినిమా ఆడుతున్న అన్ని థియేటర్లలోనూ అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. తొలిరోజు డివైడ్ టాక్ తెచ్చుకున్న అఖండకు ఇంత లాంగ్ రావడంతో పాటు ఈ సినిమా ఏకంగా అర్థశతదినోత్సవం జరుపుకోవటం… అదికూడా 50కి పైగా కేంద్రాల్లో ఈ అరుదైన ఫీట్ సాధించడం చూస్తుంటే బాలయ్య క్రేజ్ మామూలుగా లేదనే చెప్పాలి. ఇక అఖండ జోష్‌తో ఉన్న బాలయ్య తన నెక్ట్స్ సినిమాను మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో శృతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.