Moviesరాజ‌మౌళికి భ‌యం వేసిన‌ప్పుడ‌ల్లా గుర్తు చేసుకునే సిరివెన్నెల పాట ఇదే..!

రాజ‌మౌళికి భ‌యం వేసిన‌ప్పుడ‌ల్లా గుర్తు చేసుకునే సిరివెన్నెల పాట ఇదే..!

ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆకస్మిక మరణం తెలుగు సినిమా ఇండస్ట్రీ కలిచివేస్తోంది. సిరివెన్నెల ఇక లేరు అన్న విషయం తెలియడంతో ప్రతి ఒక్కరు షాక్‌కు గుర‌వుతున్నారు. కేవలం సినిమా సెల‌బ్రిటీలు.. సినిమా ప్రేక్షకులకు మాత్రమే కాదు ఆయన పాట‌ల‌కు ఎన్నో సంవత్సరాలుగా అభిమానులుగా ఉన్న‌ రాజకీయ ప్రముఖుల నుంచి ప్రధాని మోడీ, ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో సహా ఎంతోమంది విచారం వ్యక్తం చేస్తూ సిరివెన్నెల పాటలను గుర్తు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి సైతం సిరివెన్నెల మరణం పట్ల చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆయ‌న ఓ పోస్టు షేర్ చేశారు. 1996వ సంవత్సరంలో తమ కుటుంబం అర్ధాంగి అనే సినిమాతో అప్పటివరకు తాము సంపాదించిన డబ్బు… పేరు మొత్తం పోగొట్టుకున్నాము. వచ్చేనెల నుంచి ఇంటి అద్దె ఎలా క‌ట్టాలో తెలియ‌ని పరిస్థితి.

అలాంటి పరిస్థితుల్లో నాకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు న‌డిపించిన‌ సీతారామశాస్త్రిగారికి ఇప్పుడు రుణపడి ఉంటానని చెప్పారు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి… ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి అన్న సీతారామశాస్త్రిగారి పదాలు తనకు భయం వేసినప్పుడల్లా గుర్తు చేసుకొని పాడుకుంటూ ఉంటే తనకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది అని రాజమౌళి చెప్పారు. మద్రాసులో డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటలకు ఆయన ఇంటికి వెళ్లాను.. ఏం కావాలి నంది అని అడిగారు.

ఒక కొత్త నోట్ బుక్ ఆయన చేతుల్లో పెట్టి మీ చేత్తో ఆ పాట రాసి ఇవ్వ‌మని అడిగాను… ఆయన ఆ పాట రాసి సంతకం పెట్టి ఇచ్చారు. జనవరి ఒకటో తేదీ మా నాన్నగారికి అది గిఫ్టుగా ఇచ్చాను. నాన్నగారి కళ్ళల్లో ఆనందం … మాటల్లో చాలా కొత్తగా కనిపించిన విశ్వాసం తాను ఎప్పటికీ మర్చిపోలేను అని రాజమౌళి పోస్ట్ చేశారు. ఏదేమైనా సిరివెన్నెల పదాలు రాజమౌళి జీవితం పై ఎంతగా ప్రభావం చూపాయో ఆయన మాటల్లోనే అర్థమవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news