టాలీవుడ్లో నాగార్జున తన కెరీర్ మొత్తంగా చూస్తే కొత్తదనం ప్రోత్సహించే విషయంలో ఎప్పుడూ ముందు ఉంటాడు. కొత్త నిర్మాతలకు అవకాశాలు ఇవ్వడం.. కొత్త రైటర్లను ఎంకరేజ్ చేయడం.. కొత్త దర్శకులను ప్రోత్సహించే స్టార్, సీనియర్ హీరో నాగార్జున ఒక్కడే అని చెప్పాలి. నాగార్జునే సంతోషంతో దశరథ్ను, శివతో రాంగోపాల్ వర్మను, మాస్‌తో లారెన్స్ లాంటి స్టార్ దర్శకులను పరిచయం చేశారు.
నాగార్జున అమ్మాయిల కలల రాకుమారుడు మాత్రమే కాదు.. యాక్షన్ సినిమాల్లోనూ నటించారు. భక్తిరస చిత్రాలతోనే అఖిల తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. అన్నమయ్య, శ్రీరామదాసు, శిర్డీ సాయి సినిమాలే ఇందుకు ఉదాహరణ. ఈ క్రమంలోనే నాగార్జున కొన్ని వైవిధ్యమైన సినిమాల్లోనూ నటించాడు. అందులో కొన్ని అనుకున్న ఫలితాలు అందుకోలేదు. ఇందులో బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్‌తో చేసిన క్రిమినల్ ఒకటి.
మహేష్‌భట్ దర్శకత్వంలో నాగార్జున – రమ్యకృష్ణ – మనీషా కోయిరాలా జంటగా నటించిన క్రిమినల్. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా సినిమాపై ఉన్న హైప్‌తో పోల్చుకున్నంత హిట్ కాలేదు. నాగార్జున ఈ సినిమాను ఎంతో ఇష్టపడి చేశాడు. మహేష్‌భట్ డైరెక్ట్ చేసిన ఏకైక తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు నాగార్జున మరో సినిమా గురించి పట్టించుకోలేదు.
ఈ సినిమా రీ రికార్డింగ్ పనులు నాగార్జున స్వయంగా పర్యవేక్షించారు. కీరవాణి సంగీతం అందించారు. సాధారణంగా స్టార్ హీరోలు రీ రికార్డింగ్ గురించి పెద్దగా పట్టించుకోరు. నాగ్ దగ్గరుండి రీ రికార్డింగ్ చూసుకున్నా ఆడియో మంచి హిట్ అయ్యింది. అయితే సినిమా మాత్రం అంచనాలు అందుకోలేదు.