భారీ వర్షాలు హైదరాబాద్ వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే భారీగా ముంచెత్తిన వానలు అక్కడ పెద్ద విషాదాన్ని మిగిల్చాయి. అవి మరువక ముందే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మూసి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఇది హైదరాబాద్ బస్తీ వాసుల జీవితాలను అతాకుతలం చేస్తోంది. ఛాదర్ ఘాట్ బ్రిడ్జితో సహా పక్కన ఉన్న బస్తీలను మూసీ ముంచేసింది. ఇక్కడ 50కి పైగా పేదలు ఉండే ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఛాదర్ ఘాట్ – మలక్ పేట – దిల్ సుఖ్ నగర్ ప్రధాన రోడ్డు బంద్ అయ్యింది.
బస్తీల్లోకి నీళ్లు వచ్చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. అధికారులు 5 అడుగుల మేర 12 గేట్లు ఎత్తేశారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీనది ఉగ్రరూపం దాల్చింది. రోడ్లే కాల్వల్లా మారిపోవడంతో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. ఇక పాతబస్తీల్లోకి పలు ప్రాంతాల్లో వరద నీరు రావడంతో ప్రజలు రోడ్లపైకి రావొద్దని సీపీ అంజనీకుమార్ సూచించారు. పోలీసులు, రెస్క్యూ టీం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.