ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ ఉన్ ప్రపంచానికి పెద్ద నియంతగా మాత్రమే తెలుసు. అయితే కిమ్ బాధపడడం మనం ఎప్పుడు విని ఉండము… ఏ వీడియోలో కూడా చూసి ఉండము. అలాంటి కిమ్ ఒక్కసారిగా భోరున ఏడ్చేశాడు. తన దేశ దుస్థితి తలచుకుని విలవిల్లాడిపోయాడు. కిమ్ కన్నీళ్లు ఆగలేదు. కారణం ఏంటంటే ఉత్తరకొరియా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 75 ఏళ్లు అయిన వేళ కిమ్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను..అని కిమ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు భోరున భావోద్వేగానికి గురయ్యారు.
మీరు నా పై ఉంచిన నమ్మాకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను… అందుకు సిగ్గుపడుతున్నానని.. దేశ ప్రజలను కష్టాల నుంచి ఒడ్డెక్కించేందుకు తాను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయంటూ కిమ్ వాపోయాడు. దేశాన్ని ఆర్థికంగా పటిష్టం చేసేందుకు తాను ఎన్నో అనుకున్నా కరోనా, తుఫాన్ల వల్ల, అంతర్జాతీయ ఆంక్షల వల్ల తాను లక్ష్యాలను సాధించలేకపోయానని కిమ్ చెప్పాడు.
ఈ సందర్భంగా జరిగిన మిలిటరీ పరేడ్‌లో ఉత్తరకొరియా ప్రభుత్వం మునుపెన్నడూ చూడని ఓ భారీ ఖండాంతర క్షిపణికి ప్రదర్శించింది. ఇతర దేశాల రక్షణ నిపుణులు దీనిని రాకాసిగా చెపుతున్నారు. ఇది సుదీర్ఘ లక్ష్యాలను సైతం సులువుగా చేధిస్తుందని అంటున్నారు. అమెరికా చేరే క్షిపణులు ఉత్తర కొరియా వద్ద లేవన్న సందేహాల నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగించడంతో పాటు తన బల ప్రదర్శన చూపించిందని అంతర్జాతీయంగా చర్చలు నడుస్తున్నాయి.