సాధారణంగా మనం అత్తింటి ఆరళ్లకు కోడలు బలి… అత్తింటి వేధింపులు భరించలేక కోడలు ఆత్మహత్య లాంటి వార్తలు మనం చూస్తూనే ఉంటాం.. అయితే వరంగల్ జిల్లాలో మాత్రం ఇందుకు పూర్తి రివర్స్ సంఘటన జరిగింది. వరంగల్ ఆటోనగర్, తుమ్మలకుంటకు చెందిన పిండి దేవేందర్ (25)కు సంగెం మండలం కోట వెంకటాపూర్‌కు చెందిన న్యాల అనూష అలియాస్ లావణ్యతో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇక దేవేందర్‌కు తరచూ అత్తవారింట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 9న అత్త రాజమ్మ, బావమరిది అనిల్, భార్య అనూష వారి బంధువులు న్యాల బుచ్చయ్య, రవి, ప్రసాద్‌లు దేవేందర్ ను చెట్టుకు కట్టేసి, బూతులు తిట్టుతూ కొట్టారు. ఈ సంఘటన తర్వాత తీవ్ర మనస్థాపంతో ఉన్న దేవేందర్ ఈ నెల 16న పిల్లలను చూసి వస్తానని అత్త ఇంటికి వెళ్లాడు. అత్తింటికి వెళ్లి తన కుమార్తెలను చూపించమని అడిగినా వారు చూపించలేదు. దీంతో మనస్థాపంతో దేవేందర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అదే సమయంలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. కాలిన గాయాలతో ఉన్న దేవేందర్‌ను కొందరు వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు తల్లి ఫిర్యాదు మేరకు దేవేందర్ అత్తింటి వాళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.