తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్‌కౌంటర్ కలకలం రేపుతోంది. అక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత భాస్కర్ తృటిలో తప్పించుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం భాస్కర్ టార్గెట్‌గా కూంబింగ్ జరుగుతోంది. కాగజ్‌నగర్ మండలం ఈజ్‌గామ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కడంబ అడవుల్లో పోలీసులు ఈ కూంబింగ్ చేస్తుండగా అక్కడ వారికి మావోయిస్టులు కనపడ్డారు. ఈ క్రమంలోనే జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
మరో ముగ్గురు మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నారు. మృతుల్లో ఛత్తిస్‌గడ్‌కు చెందిన కోయా జంగు.. అలియాస్ వర్గీస్, నిర్మల్ జిల్లా కడెంకు చెందిన కంచి లింగవ్వ ఉన్నట్లుగా సమాచారం. ఇక ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో రెండు ఏకే 47 తుపాకులతో పాటు మావోయిస్టులకు చెందిన సామగ్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కీలక నేత భాస్కర్‌ను పట్టుకుని తీరతామని పోలీసులు చెపుతున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భాస్కర్ దళం కోసం పోలీసులు గత మూడు నెలలుగా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.