కరోనా వైరస్ మహ్మమారి ఏ ఒక్కరినీ వదలడంలేదు. ఇక రాజకీయ నాయకులు తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన పరిస్థితులు ఉండడంతో వారికి సులువుగానే కరోనా సోకుతోంది. వీరిలో వృద్దులుగా ఉన్నవారు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్నటికి నిన్న వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ రోజు కోవిడ్ మరో ఎంపీని బలి తీసుకుంది.
కరోనా భారీన పడి బీజేపీకి చెందిన కర్నాటక రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ (55) కన్నుమూశారు. కరోనాకు చికిత్స పొందుతూ బెంగళూరు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇక రెండు నెలల క్రితమే అశోక్ గస్తీ రాజ్యసభకు ఎంపిక కావడం.. జూలై 22నే ప్రమాణ స్వీకారం చేయడం జరిగాయి. బీజేపీలో చిన్న కార్యకర్త స్తాయి నుంచి ఆయన రాజ్యసభకు వెళ్లారు. రాజ్యసభకు ఎన్నికైన మూడు నెలలకే ఆయన మృతి చెందారు.