సినిమా: సరిలేరు నీకెవ్వరు
నటీనటులు: మహేష్ బాబు, విజయశాంతి, రష్మక మందన్న, ప్రకాష్ రాజ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాతలు: దిల్ రాజు, అనిల్ సుంకర
దర్శకత్వం: అనిల్ రావిపూడి
రిలీజ్ డేట్: 11-01-2020
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు సంక్రాంతి సందడి మొదలుపెట్టేందుకు నేడు ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్లతో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ అయిన భారతి(విజయశాంతి) నిజాయితీకి మారుపేరుగా ఉంటుంది. తాను చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు భారతి సాయం కోరుతాడు విలన్ ప్రకాష్ రాజ్. దీనికి ససేమిరా అంటోంది భారతి. కట్ చేస్తే.. ఇండియన్ ఆర్మీలో మేజర్ అజయ్ కృష్ణ(మహేష్ బాబు), రాజేంద్ర ప్రసాద్, సత్యదేవ్‌లో కలిసి ఓ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తాడు. కాగా కొన్ని కారణాల వల్ల రాజేంద్రప్రసాద్‌తో కలిసి కర్నూలు వెళతాడు అజయ్ కృష్ణ. ఈ క్రమంలో ట్రెయిన్‌లో అతడిని చూసిన సంస్కృతి(రష్మిక) తొలిచూపులోనే ప్రేమిస్తుంది. కట్ చేస్తే.. విజయశాంతికి సాయం చేసేందుకు అజయ్ కృష్ణ ఆమె ఇంటికి చేరుకుంటాడు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్, మహేష్‌ల మధ్య వార్ మొదలవుతుంది. అసలు విజయశాంతిని ప్రకాష్ రాజ్ ఎందుకు ఇబ్బంది పెడుతుంటాడు? అజయ్ కృష్ణ కర్నూలు ఎందుకు వస్తాడు? రష్మిక లవ్ ప్రపోజల్‌ను మహేష్ ఒప్పుకుంటాడా లేడా? అనేది సినిమా కథ.
విశ్లేషణ:
దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి మొదట్నుండీ ఒకే మాట చెబుతున్నాడు. ఈ సినిమా కథను మీరు ఇప్పటివరకు చూసి ఉండరని, ఈ సినిమా కథ పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుందని. ఆయన అన్నట్లుగానే ఈ సినిమా కథను అస్సలు ఊహించని విధంగా చిత్రాన్ని తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నాడు.
ఇక కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో ప్రొఫెసర్ పాత్రలో విజయశాంతి ఎంట్రీతో మొదలుకొని, మేజర్ పాత్రలో మహేష్ ఎంట్రీ వరకు ఎలివేషన్స్‌ను బాగా చూపించాడు దర్శకుడు. అటు మేజర్ పాత్రలో మహేష్ యాక్టింగ్ పీక్స్ అని చెప్పాలి. ఒక పెద్ద ట్విస్ట్‌తో మహేష్, రాజేంద్ర ప్రసాద్ కర్నూల్ రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సాగే ట్రెయిన్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ ఎపిసోడ్‌లో హీరోయిన్ రష్మిక గ్యాంగ్, బ్లేడ్ స్టార్ బండ్ల గణేష్ గ్యాంగ్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. మహేష్‌ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతుంది రష్మిక. అయితే సీరియస్ పనిపై కర్నూలు వచ్చిన మహేష్‌కు విజయశాంతిని ఇబ్బంది పెడుతున్న ప్రకాష్ రాజ్ గురించి తెలుస్తుంది. ఒక అదిరిపోయే ట్విస్టుతో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.
అటు సెకండాఫ్‌లో విజయశాంతి ఇంట్లో ఉంటూ మహేష్ ఆమెను నీడలా కాపాడుతాడు. ప్రకాష్ రాజ్‌తో యుద్ధం ప్రకటించిన మహేష్, విజయశాంతిని గెలిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాడు. అటు ప్రకాష్ రాజ్ కథను ముగించేసిన మహేష్ తిరిగి ఆర్మీలో జాయిన్ అయ్యేందుకు బయలుదేరుతాడు. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా దేశభక్తిని పెంపొందిస్తాయి. ఈ ట్విస్టు మాత్రం అస్సలు ఊహించనిదని చెప్పాలి.
ఓవరాల్‌గా కమర్షియల్ అంశాలతో పాటు దేశభక్తిని కూడా చాటే విధంగా దర్శకుడు ఈ సినిమాను మలిచిన తీరు అద్భుతం. కేవలం కమర్షియల్ సినిమాయే కదా అంటూ థియేటర్‌కు వెళ్లేవారికి అదిరిపోయే షాక్ ఇస్తాడు అనిల్ రావిపూడి. ఏదేమైనా మహేష్ మేనియాతో ఈ సినిమా సూపర్ హిట్ కావడం ఖాయం అని చెప్పాలి.
నటీనటుల పర్ఫార్మెన్స్:
ఆర్మీ మేజర్ పాత్రలో మహేష్ బాబు ఇంటెన్స్ యాక్టింగ్ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఇక ట్రెయిన్ ఎపిసోడ్‌లో మహేష్ చేసే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది. అటు నిజాయితీగల ప్రొఫెసర్‌గా విజయశాంతి రీఎంట్రీతో అదరగొట్టింది. సినిమాలో ఆమెకు మంచి స్కోప్ ఉన్న పాత్ర లభించింది. ఇది ఆమె రీఎంట్రీకి కరెక్ట్ పాత్ర అని చెప్పాలి. అటు విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ మరోసారి రెచ్చిపోయాడు. హీరోయిన్ రష్మిక మందన్న తనదైన యాక్టింగ్‌తో బాగా ఇంప్రెస్ చేసింది. కమెడియన్లు చాలా మంది ఈ సినిమాలో తమ ప్రతాపం చూపించారు. మిగతా నటీనటులు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాతో మరోసారి తన ట్యాలెంట్‌ను నిరూపించుకున్నాడు. కమర్షియల్ కంటెంట్‌కు దేశభక్తిని యాడ్ చేసి సరిలేరు నీకెవ్వరు సినిమాను తెరకెక్కించిన విధానం సూపర్. ఇంత మంది నటీనటులను ఎక్కడ ఎప్పుడు వాడాలో బాగా వాడుకున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా సూపర్‌గా ఉంది. ఈ సినిమాలోని ప్రతి సీన్‌ను హైలైట్ చేస్తూ చూపించాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆకట్టుకుంది. రెండు పాటలతో సహా బీజీఎం వర్క్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా మొత్తం చాలా రిచ్‌గా కనిపించింది.
చివరగా:
సరిలేరు నీకెవ్వరు – సంక్రాంతి మొదటి విన్నర్
రేటింగ్:
3.5/5.0