Moviesబాల‌య్య - అంజ‌లా ఝ‌వేరి కాంబినేష‌న్లో ' స‌మ‌ర‌సింహారెడ్డి ' త‌ర్వాత...

బాల‌య్య – అంజ‌లా ఝ‌వేరి కాంబినేష‌న్లో ‘ స‌మ‌ర‌సింహారెడ్డి ‘ త‌ర్వాత మిస్ అయిన సినిమా ఇదే..!

నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఎప్పటికీ మరుపురాని సినిమాలలో సమరసింహారెడ్డి సినిమా ఒకటి. బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమాగా సమరసింహారెడ్డి చరిత్రలో నిలిచింది. అప్పటివరకు టాలీవుడ్‌లో ఉన్న రికార్డుల‌కు పాత‌రేసి 77 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. సమరసింహారెడ్డి సినిమా యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆ తర్వాత టాలీవుడ్ లో ఈ తరహా కథలకు జీవం పోసింది. బాలయ్యకు జోడిగా సిమ్రాన్, సంఘవి, అంజలా ఝ‌వేరి హీరోయిన్లుగా నటించగా.. 1999 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఏడాది పాటు తెలుగు గడ్డను ఒక ఊపు ఊపేసింది.

30కు పైగా సెంటర్లలో 175 రోజులు ఆడింది. ఈ సినిమా హిట్ అయ్యాక.. రెండేళ్లకు 2001లో సంక్రాంతికి బాలయ్య ఇదే కాంబినేషన్లో నరసింహనాయుడు సినిమా చేస్తే ఆ సినిమా ఇంకా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు.. ఇండస్ట్రీ హిట్ అయింది. నరసింహనాయుడు రిలీజ్ అయిన 20 రోజులకు 2001 జనవరి 31న బాలయ్యతో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు నిర్మించిన భార్గవ్ ప్రొడక్షన్స్ సంస్థ.. ఓ భారీ జానపద సినిమాకు శ్రీకారం చుట్టింది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా నిర్మాతగా ఎస్.గోపాల్ రెడ్డి వ్యవహరించారు.

విశాఖపట్నం కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాధర కొండ ప్రాంతంలో ప్రత్యేకంగా సెట్ వేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాల‌య్య‌కు సమరసింహారెడ్డి రూపంలో మంచి లక్కీ హీరోయిన్‌గా మారిన అంజ‌లా ఝ‌వేరితో పాటు మరో బాలీవుడ్ హీరోయిన్ పూజాబాత్రలను ఎంపిక చేశారు. రెండు భారీ షెడ్యూల్‌లో షూటింగ్ కూడా జరిగింది. భానుమతి, సత్య ప్రకాష్, ప్రకాష్ రాజ్, అశోక్ కుమార్, వినోద్ కుమార్, హేమంత్రావన్, బాబు మోహన్, పద్మనాభం, మోహన్ రాజ్, సలీం, ఎం.ఎస్‌.నారాయణ, శరత్ బాబు, విజయ్ కుమార్, కె. విజయ ప్ర‌ధాన తారాగ‌ణంగా ఎంపిక చేశారు.

ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభిన‌యం చేశారు. యువతరానికి ప్రతీక అయిన ప్రతాప్ గాను.. తండ్రి విక్రమసింహ భూపతి గాను నటించారు. ఈ సినిమాకు విక్రమసింహా భూపతి టైటిల్ కూడా పరిశీలించారు. అయితే 2002 ఏప్రిల్ లో తమ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత గోపాల్ రెడ్డి చాలాసార్లు చెప్పారు. అనుకోని కారణాలవల్ల నాలుగో షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అప్పటికే భార్గవ్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేసింది. అలా అంజ‌లా ఝ‌వేరి, బాలయ్య కాంబినేషన్లో రెండో సినిమాగా రావలసిన విక్రమ‌సింహ భూపతి మధ్యలోనే ఆగిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news