ఎన్టీఆర్-అక్కినేని నాగేశ్వరరావులు.. పౌరాణిక సినిమాల నుంచి జానపదాలు.. సాంఘిక సినిమాల వరకు అనేక సినిమాల్లో కలిసి నటించారు. విడివిడిగా కూడా . వందల పాత్రలు పోషించారు. ఇప్పటిలాగా.. కాకుండా. అప్పట్లో నిర్మాతలు.. హీరోల కోసం కొన్న ఏ వస్తువునైనా.. తమతో తీసుకువెళ్లిపోయేవారట. అంతేకాదు.. వాటిని అమ్ముకునేవారట. ఇలా.. అక్కినేని, ఎన్టీఆర్‌లు ధరించిన కళ్లజోళ్లకు భారీ డిమాండ్ ఉండేదట ఆరోజుల్లో. హాట్ కేక్స్‌లా వాటిని కొనేసేవారట.
అక్కినేని నటించిన సంసారం సినిమా సూపర్ హిట్ అన్న సంగతి తెలిసిందే. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సంసారం సినిమాలో అక్కినేని వేణు పాత్ర వేశారు. అప్పటికి జానపదాల నటుడిగా పేరున్న అక్కినేనికి ఎల్వీ ప్రసాద్ ఇచ్చిన గొప్ప అవకాశంగా చెప్పుకొనేవారు. ఫస్ట్ హాఫ్‌లో అమాయక పల్లెటూరి కుర్రాడిగా, మొరటుగా ఉండే వేణు.. పట్నానికి చేరిన తర్వాత పూర్తిగా మారిపోతుంది. వేష, భాషలు, కవళికలు విభిన్నంగా కనిపిస్తాయి.
ఈ క్రమంలో గ్లామరస్‌గా కనిపించడం కోసం ఏదైనా చెయ్యాలని దర్శకుడు ఆలోచించారట. మద్రాసు మౌంట్ రోడ్డులోని మయో ఆప్టికల్స్ దుకాణానికి వెళ్లి, అప్పటి గుండ్రని అద్దాలకు భిన్నంగా తన ముఖానికి చక్కగా అమరే నలుచదరం కళ్లద్దాల్ని ఎంపిక చేసుకుని పాటలో ధరించారట. సంసారం సినిమా విజయం సాధించింది. మద్రాసు పరిసరాల్లోని పల్లవరంలో చాలా రోజులు ఆడటంతో పాటు ఈ కళ్లజోడు ట్రెండ్ సృష్టించింది.
ఆ ఊపులో మద్రాసు మయో ఆప్టికల్స్ దుకాణంలో అప్పట్లోనే అయిదు వేల పైచిలుకు కళ్లద్దాలు అమ్ముడుపోయాయట. ఇక, గజదొంగ సినిమాలో అన్నగారు రకరకాల కళ్లజోళ్లు ధరిస్తారు. వాటికి కూడా పిచ్చడిమాండ్ ఉండేది. ఈ సినిమా మొత్తం మీద 10కిపైగా ఎన్టీఆర్ కళ్లజోళ్లు మారుస్తారు. వాటికి కూడా భారీ డిమాండ్ పెరగడంతోపాటు.. అన్నగారు ధరించిన కళ్లజోళ్లకు వేలం వేస్తే.. హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయట. కానీ, ఇప్పుడు అలా కాదు.. హీరోలు.. హీరోయిన్లుతమ వెంటే తీసుకుపోతున్నారనే టాక్ ఉంది.