టాలీవుడ్లో గత ఏడాది వరకు కూడా పంపిణీరంగంలో దిల్ రాజు చెప్పిందే వేదం. దిల్ రాజుదే రాజ్యం.. అన్నట్టుగా ఉండేది అన్న ప్రచారం అందరికీ తెలిసిందే. నైజాం పంపిణీ రంగాన్ని తన కనుసైగలతో శాసిస్తూ వస్తున్నారు దిల్‌రాజు. చివరకు పెద్దపెద్ద హీరోలు సైతం ఈ విషయంలో దిల్ రాజుకు కొన్నిసార్లు తలవంచక తప్పని పరిస్థితి. కొన్ని పెద్ద సినిమాలు తమకు ఇష్టం లేకపోయినా నైజాం పంపిణీని దిల్ రాజు చేతిలో పెట్టేస్తున్నాయి. అలా ఆయన చక్రం తిప్పుకుంటున్నారన్న గుసగుసలు కూడా ఉన్నాయి. నైజాం వసూళ్లు అనేవి గత ఏడాది వరకు ఓ బ్రహ్మ పదార్థంలా ఉండేవి. అసలు ఏ సినిమాకు ఎంత కలెక్షన్ వస్తుందో సరైన లెక్కలు బయటకు వచ్చేవి కావని.. ట్రేడ్ వర్గాల్లో చర్చ ఉంది.
వరంగల్ శ్రీను రెండు మూడు సినిమాలతో కాస్త సక్సెస్ అయ్యి.. దిల్ రాజుకు పోటీ ఇస్తూ హడావుడి చేశారు. ఆయన కూడా దిల్ రాజు ఏక చక్రాధిపత్యాన్ని.. అణిచివేతను విమర్శిస్తూ బహిరంగంగానే విమర్శలు చేశారు. వరంగల్ శ్రీను కొన్న లైగర్, ఆచార్య డిజాస్టర్ కావడంతో ఆయన రేసులో వెనుకబడిపోయారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి నుంచి నైజాం పంపిణీ రంగంలోకి మైత్రీ మూవీస్ ఎంటర్ అయ్యింది. మైత్రి మూవీస్ కు ఆంధ్రాలో బలమైన పొలిటికల్ లీడర్ల బ్యాకప్ ఉందని కూడా అంటూ ఉంటారు. గత కొన్ని నెలలుగా వరుస పెట్టి టాలీవుడ్లో స్టార్ హీరోలతో పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ పెద్ద పెద్ద బ్యానర్లకే సవాళ్లు విసురుతోంది.
ఈ ఏడాది సంక్రాంతికి ఒకేసారి ఇద్దరు పెద్ద హీరోలు బాలయ్యతో వీరసింహారెడ్డి, చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాలు తీసి నైజాంలో సొంతంగా రిలీజ్ చేసుకుని మరి.. రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి అక్కడ పంపిణీరంగాన్ని శాసిస్తున్న పెద్దపెద్ద వారికే పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత కళ్యాణ్‌రామ్ తో అమీగోస్ సినిమా, విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలతో ఈ ఏడాది మైత్రీ సక్సెస్ అయింది. ఇక తాజాగా సలార్ సినిమాను నైజాంలో దిల్ రాజు చెప్పిన రేటు కంటే ఎక్కువ ఇచ్చి మరి కొనుగోలు చేసింది. ఇది చాలా పెద్ద రిస్క్ అని అందరూ అనుకున్నారు. కానీ.. ఇప్పుడు మూడు రోజుల్లో నైజాంలో సలార్‌కు రూ.45 కోట్ల షేర్ వచ్చింది.
చాలా సులువుగా మైత్రి వాళ్ళు పెట్టిన పెట్టుబడి రావడంతో పాటు భారీ లాభాలు కళ్ళు చూసే అవకాశం ఉంది. ఇక సంక్రాంతికి దిల్ రాజు గుంటూరు కారం, సైంధవ్ ( మేజర్ పార్ట్ అని టాక్ ) సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజుకి పోటీగా చిన్న సినిమా అయినా హనుమాన్ పంపిణీ హక్కులు నైజాంలో మైత్రి మూవీస్ సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పెద్ద సినిమాల కోసం హనుమాన్ సినిమాను వాయిదా వేయాలని.. ఈ సినిమాకు థియేటర్లు లేకుండా చేసే కుట్ర కూడా జరుగుతోందన్న ప్రచారం నడుస్తోన్న టైంలో మైత్రీ వాళ్లు ఎంటర్ అయ్యారు.
ఏది ఏమైనా నిన్నటి వరకు నైజాం పంపిణీ రంగంలో దిల్ రాజుకు ఎదురు లేదు. ఇప్పుడు మైత్రి ఆయనకు పెద్ద పెద్ద సవాళ్లు విసురుతూ సరైన మొగుళ్ళం అనిపిస్తున్నారన్న చర్చలు కూడా టాలీవుడ్ వర్గాల్లో బాగా జరుగుతున్నాయి. అయితే మైత్రీ మూవీస్ పంపిణీ రంగంలో కూడా దిల్‌రాజు అధిపత్యాన్ని సవాల్ చేయటంపై టాలీవుడ్లో చాలామంది ఖుషి ఖుషిగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది.