నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అలాగే ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలలో మంగమ్మగారి మనవడు సినిమా ఒకటి. ఇది అచ్చ తెలుగు గ్రామీణ చిత్రం. బాలకృష్ణ హీరోగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా ఉభయగోదావరి జిల్లా పరిధిలోని కడియం, దామిరెడ్డి పల్లె, బుర్రిలంక, వేమగిరి, విజ్జేశ్వరం, ఉండ్రాజవరం, పట్టిసీమ ప్రాంతాలలో జరిగింది. ఈ సినిమాకు ఆ రోజుల్లో రూ.15 లక్షలు ఖర్చు చేశారు. 1984 సెప్టెంబర్ 7న ఈ సినిమా విడుదల అయింది.
బాలకృష్ణ కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణ ఈ సినిమాలో భామపాత్రకు జీవం పోశారు. ఈ సినిమా ఆ రోజుల్లో 28 కేంద్రాలలో వంద రోజులు ఆడింది. హైదరాబాద్ తారకరామా థియేటర్‌లో రజతోత్సవం జరుపుకుంది. స్లాబ్ విధానంలో తొలి సిల్వర్ జూబ్లీ సినిమాగా మంగమ్మగారి మనవడు చరిత్రలో నిలిచిపోయింది. హైదరాబాద్ నగరంలో 38 సంవత్సరాల క్రితమే షిఫ్టింగ్‌లతో 565 రోజులు ఆడి ఆల్ టైం నెలకొల్పింది. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక పాటలో శ్రీరాముడిగాను, శ్రీకృష్ణుడు గాను కనిపించి కనువిందు చేస్తారు.
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన నేపథ్యంలో 1984 అక్టోబర్ 19న విశాఖపట్నం రాజ్ కమల్ థియేటర్లో అభినందన సభ జరిగింది. ఈ సినిమాలో ఆల్ టైం సూపర్ డూపర్ హిట్. ఈ మూవీలో పాట దంచవే మేనత్త కూతురా ఇప్పటికీ తెలుగు శ్రోతల హృదయాల్లో నానుతూ ఉంటుంది. మంగమ్మగారి మనవడు సూపర్ డూపర్ హిట్ అయ్యాక హీరో బాలకృష్ణకు తిరిగిలేని స్టార్‌డమ్ వచ్చింది. ఆ తర్వాత నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి, దర్శకుడు కోడి రామకృష్ణ, బాలకృష్ణ కాంబినేషన్లో మరెన్నో సంచలన సినిమాలకు ఈ సినిమా నంది పలికింది.