సినిమా కల్చర్ వల్ల సొసైటీలో చాలామంది ప్రభావితం చెందుతున్నారంటే ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ప్రతీ దాంట్లో మంచి చెడు అనేవి రెండూ ఉంటాయి. వీటిలో ఎప్పుడు కూడా మంచి కంటే చెడు ప్రభావమే ఎక్కువగా జనాలపై ఉంటుంది. మంచి సినిమా కంటే యూత్ ఎంజాయ్ చేసే సినిమాలే ఎక్కువగా సక్సెస్ సాధిస్తున్న సందర్భాలు ఎప్పుడూ చూస్తూనే ఉంటాము. సినిమాలు చూసే జనాలు పాడవుతున్నారనే వాదన కొందరు సామాజిక వేత్తలు అంటుంటే సొసైటీలో జరిగే సంఘటనల ఆధారంగా మేము సినిమాలు తీస్తున్నామని వాదిస్తున్నవారూ ఉన్నారు.
భాష ఏదైనా మంచి అనిపిస్తే తీసుకోవాలి. కానీ, అది జరగడం లేదు. సినిమా ఇండస్ట్రీలో అలాగే బయట కల్చర్ పరంగా ఊహించని మార్పులు వచ్చాయి. ముఖ్యంగా లివింగ్ టు గెదర్ అనే విధానం వచ్చి సమాజంలో విలువలు లేకుండా చేసింది. మనసుకు నచ్చితే పెళ్ళితో సంబంధం లేకుండా సహజీవనం చేయడం ఇప్పుడు ఓ అందమైన లైఫ్ గా కనిపిస్తోంది. కొన్ని సందర్భాలలో పెళ్ళి కాకుండా బిడ్డకి జన్మనిస్తున్నవారు ఉన్నారు. బయట ఇలాంటిది జరిగితే జనాల మీద అంతగా ప్రభావం చూపకపోవచ్చు గానీ, అభిమాన తార గనక ఇలా తల్లైతే ఎంతో మంది దాన్ని ఫాలో అయ్యేవారుంటారు.
శంకర్ సినిమాతో సౌత్ మొత్తం బాగా పాపులర్ అయిన ఎమీజాక్సన్ కొతకాలం ప్రేమలో ఉంది. తన ప్రియుడుతో కలిసి సహజీవనం చేసింది. పెళ్ళి చేసుకుంటారని అందరూ అనుకుంటుంటే ఏకంగా గర్భవతి అనే విషయాన్ని, ఆ తర్వాత బిడ్డకి జన్మనిచ్చిన న్యూస్ ని చెప్పి షాకిచ్చింది. దీనిని అందరూ అంగీకరించలేదు. ఇలాంటి వారు సొసైటీలో ఉండడం ఇంకొందరిని చెడగొట్టేందుకు ఆస్కారం ఇవ్వడమే అంటూ కామెంట్స్ వినిపించాయి. అలాగే, అది తన వ్యక్తిగత విషయం అని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వారూ ఉన్నారు.
ఇదే కోవలోకి మన టాలీవుడ్ బ్యూటీ గోవా భామ ఇలియానా డీక్రజ్ కూడా లవ్ లో ఉండింది. ఆ తర్వాత అతనితో మూడుముళ్ళ బంధానికి సిద్ధమవుతుందని వార్తలు వచ్చాయి. కట్ చేస్తే ఇలియానా కూడా ప్రగ్నెంట్ అనే విషయాన్ని చెప్పి షాకిచ్చింది. ఆ తర్వాత బిడ్డకి జన్మనిచ్చి ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకి చెప్పింది. ఇది కూడా అందరూ జీర్ణించుకోలేపోయారు. రానురాను ఇక పెళ్ళి కాకుండానే సహజీవనం చేసి బిడ్డని కనొచ్చు..అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి వాటి వల్ల సమాజానికి మరింత నష్టమే గానీ, ఉపయోగం ఏమీ ఉండదు.