Newsఎన్టీఆర్ ప్ర‌తి సినిమాలో కాస్ట్యూమ్స్‌కు ఆ ఊరికి ఉన్న సెంటిమెంట్ ఇదే..!

ఎన్టీఆర్ ప్ర‌తి సినిమాలో కాస్ట్యూమ్స్‌కు ఆ ఊరికి ఉన్న సెంటిమెంట్ ఇదే..!

ద‌ర్శ‌కుడిగా, న‌టుడిగా, నిర్మాత‌గా త‌న‌దైన శైలితో తెలుగు సినిమా రంగాన్ని ఒక మ‌హ‌ర్ద‌శ‌కు చేర్చిన అన్న‌గారు ఎన్టీఆర్‌.. అనేక వైవిధ్య పాత్ర‌లు పోషించారు. పౌరాణిక‌, జాన‌ప‌ద చిత్రాలు అల‌వోక‌గా చేసేవారు. ఒక సారి.. చీరాల స‌మీపంలోని సముద్ర తీరంలో శ్రీకృష్ణ తులాభారం సినిమాను చిత్రీక‌రిస్తున్నారు. రెండు సీన్ల‌కోసం.. మొద‌ట్లో విశాఖ వెళ్లాల‌ని అనుకున్నారు. అయితే.. దూరాభారం అవుతుంద‌ని భావించి చీరాల‌కే ప‌రిమితం అయ్యారు.

ఈ స‌మ‌యంలో అన్నగారు వ‌స్తున్నార‌న్న వార్త పెద్ద ఎత్తున ప్ర‌చారం అయింది. దీంతో చేనేత కార్మికులు, మ‌త్స్య‌కారులు.. ఆయ‌న‌ను చూసేందుకు సినిమా షూటింగ్ వీక్షించేందుకు అక్క‌డ‌కు చేరుకున్నారు. షూటింగ్ అయిపోయింది. అనంత‌రం.. అన్న‌గారు శ్రీకృష్ణుని వేషంలోనే అంద‌రి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. ఈ స‌మ‌యంలో ఒక మ‌హిళ అన్న‌గారిపై ప్రేమ‌తో చేప‌ల పులుసు అందించ‌గా.. ఆప్యాయంగా ఆయ‌న ఆరగించారు.

తెల్ల‌వారి చేప‌ల పులుసు ఆర‌గించిన‌ శ్రీకృష్ణుడు అని ఆంధ్ర‌ప‌త్రిక‌లో వార్త వ‌చ్చింది. ఇది అప్ప‌ట్లో ఒక చ‌రిత్ర‌. స‌రే.. ఈ సంద‌ర్భంగా.. చేనేత‌లు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొన్నారు. అయితే.. అప్ప‌టికి అన్న‌గారు.. సినిమారంగంలోనే బిజీగా ఉన్నారు. అయితే.. చేనేత క‌ష్టాలు విని ఆయ‌న మ‌న‌సు క‌రిగిపోయింది. వెంట‌నే ఆయ‌న వారికి భారీ హామీ ఇచ్చారు.

ఇక నుంచి తీసే.. పౌరాణిక‌, జాన‌ప‌ద చిత్రాల్లో చేనేత వ‌స్త్రాల‌నే తాను ధ‌రిస్తాన‌ని.. వాటిని కూడా చీరాల నుంచి కొనుగోలు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. అన్న‌ట్టుగానే ఆయ‌న త‌ర్వాత‌.. తీసిన ప్ర‌తి సినిమాలోనూ చీరాల చేనేత‌నే వాడారు. ఇలా.. వారికి ఎంతో సాయం చేశారు. అధికారంలోకి వ‌చ్చాక‌.. జ‌న‌తా వ‌స్త్రాల పేరుతో.. చేనేత‌ను కొత్త‌పుంత‌లు తొక్కించారు. ఆప్కో సంస్థ‌ను ఏర్పాటు చేశారు. ఇదీ.. అన్న‌గారి హామీ అంటే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news