బ్లాక్ అండ్ వైట్ సినిమాల జోరు కొనసాగుతున్న సమయంలో అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు ఒక ట్రెండును సృష్టించారు. ఎవరికి వారు పోటాపోటీగా సినిమాలు చేసేవారు. అదేసమయంలో చాణక్య, చం ద్రగుప్త, భూకైలాస్ వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఎవరు కలిసి నటించినా.. విడివిడిగా నటించినా.. ఎవరి ప్రాధాన్యం వారికి ఉంది. అయితే.. వీరిద్దరూ కలిసి కూడా ట్రెండు సృష్టించారు. వాస్తవానికి ఎవరి హీరోను వారి అభిమానులు ఆరాధించేవారు.
ఎవరికి వారికి సంఘాలు ఉండేవి. కానీ, అక్కినేని, ఎన్టీఆర్‌ల విషయానికి వస్తే మాత్రం ఇద్దరికీ ఉమ్మడి సంఘాలు ఉన్న విషయం చాలా మందికి తెలియదు. ఇద్దరు కూడా కృష్ణా జిల్లాకు చెందిన వారు కావడం.. సినిమాల్లో సుదీర్ఘ కాలం కలిసి పనిచేయడంతో వారి అభిమానులు కూడా కలిసే ఉన్నారు. ఎవరి పుట్టిన రోజు పంక్షన్ వచ్చినా.. ఇద్దరి అభిమానులు కలిసి పండగలా చేసుకునేవారు.
ఇక ఇలాంటి ట్రెండు మనకు కృష్ణ – శోభన్‌బాబుల విషయంలో కనిపిస్తుంది. ఇద్దరూ కూడా కలర్ మూవీల సమయానికి మంచి ఫామ్‌లో ఉన్నారు. ఎవరికి వారే సినిమాలు చేసుకున్నా.. ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. శోభన్‌బాబు కృష్ణ జిల్లా వాసి అయినా.. కృష్ణ.. గుంటూరు జిల్లాకు చెందిన నటుడే అయినా.. ఇరు జిల్లాలలోనూ ఉమ్మడి అభిమాన సంఘాలు ఉండేవి.
అందరూ కలిసిమెలిసి కార్యక్రమాలు చేసుకునేవారు. అయితే.. కృష్ణ మాత్రం ఫండింగ్ చేయగా, శోభన్‌బాబు మాత్రం సంఘాలను పెద్దగా ప్రోత్సహించేవారు కాదు. దీనివల్ల అభిమానులకు ఒరిగేది ఏమీ ఉందని ఆయన చెప్పేవారు. అయినప్పటికీ.. ఇరు సంఘాలు మాత్రం కలిసి ఉండడం గమనార్హం.