సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న ప్రముఖ మలయాళ డైరెక్టర్ సిద్ధిక్ (63) మృతి చెందారు. గత రెండు రోజులుగా అనారోగ్య సమస్యలతో చాలా సీరియస్ కండిషన్లో ఉన్న ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో మలయాళ ఇండస్ట్రీలో విషాదచాయలు అలుముకున్నాయి. హీరోయిన్ కీర్తి సురేష్ – కొరియోగ్రాఫర్ ప్రభుదేవా – స్టార్ హీరో మోహన్‌లాల్‌తో పాటు సిద్ధిక్ తో పరిచయం ఉన్న పలువురు తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం మధ్యాహ్నం ఆయనకి గుండెపోటు వచ్చింది. దీంతో కేరళలోని కోచ్చీలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు లివర్ సంబంధిత సమస్యలతో పాటు న్యుమోనియా కూడా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఎక్మో సాయంతో చికిత్స అందించేందుకు వైద్యులు ప్రయత్నించారు. ఆయన త్వరగా కోలుకుంటారని అందరూ అనుకున్నారు. అయితే పరిస్థితి చేయి దాటి పోవడంతో ఆయన ప్రాణాలు వదిలేశారు. సిద్ధిక్ అసలు పేరు సిద్ధికి ఇస్మాయిల్. ఆయన డైరెక్టర్, స్క్రీన్ రైటర్.. నిర్మాత కూడా..!
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌కు సిద్ధిక్ బెస్ట్ ఫ్రెండ్. వీళ్లిద్దరి కాంబినేషన్లో చాలా సినిమాల వచ్చాయి. ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కూడా ఉన్నాయి. ఆయన తొలి సినిమాతో పాటు చివరి సినిమా బిగ్ బ్రదర్ ఈ రెండిట్లోనూ మోహన్లాల్ హీరో కావడం విశేషం. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బ్లాక్ పాస్టర్ హిట్ సినిమాలలో ఒకటైన హిట్లర్ కథ సిద్ధిక్‌దే కావటం విశేషం.
మళయాళం లో అదే పేరుతో మమ్ముట్టి హీరోగా తీసిన సినిమానే చిరంజీవి తెలుగులో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రీమేక్ చేశారు. ఇక పలు భాషల్లో రిమెక్ అయిన బాడీగార్డ్ సినిమా ఒరిజినల్ దర్శకుడు కూడా ఈయనే. తెలుగులో నితిన్ హీరోగా మారో అనే సినిమాను సిద్ధికి తెరకెక్కించారు. అయితే ఈ సినిమా సరిగా ఆడలేదు. ఆ తర్వాత ఆయన తెలుగులో మరో సినిమా చేయలేదు.