ఆ సినిమా నేను చేయను.. అని ఇప్పట్లో పెద్దగా ఎవరూ హీరోయిన్లు అనడం లేదు. ఎందుకంటే.. డబ్బు లు ఇస్తే.. చాలు..ఏదొ ఒక సినిమాను ఒప్పేసుకుంటున్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. పైగా.. అవకాశాలు కూడా ఆశించినంతగా రావడం లేదు. దీంతో వచ్చిందే చాలు అన్నట్టుగా ప్రస్తుతం హీరోయిన్లు సర్దుకు పోతున్నారు. కానీ, ఒకప్పుడు మాత్రం ఇలాంటి పరిస్థితి లేదు. హీరోయిన్లు కూడా హీరోలతో సమానంగా ఉండేవారు.
వారు కూడా కథలను ఎంపిక చేసుకునే వారు. కథనచ్చితేనే.. సినిమాలకు ఓకే చెప్పేవారు. నచ్చకపోతే.. నిర్మొహమాటంగా తప్పుకొనే వారు. ఇలా.. ఒక సందర్భంలో వేదాంతం రాఘవయ్య.. బెంగాలీ నవల దేవదాసును సినిమాగా తీయాలని అనుకున్నారు. దీనికి సంబంధించి కసరత్తు కూడా చేశారు. ఈ క్రమంలో ఈ సినిమాకు నాగేశ్వరరావును ముందుగానే అనుకున్నారు. ఇక,హీరోయిన్ విషయానికి వస్తే.. భానుమతిపై వేదాంతం వారికి గురి ఎక్కువ.
దీంతో భానుమతిని కన్ఫర్మ్ చేయమని.. ప్రొడక్షన్ సంస్థకు చెప్పేశారు. కానీ, ఆమెకు ఈ విషయం తెలియదు. దీంతో ఒక రోజు.. ప్రొడక్షన్ కంపెనీ మేనేజర్.. భానుమతి ఇంటికి వెళ్లి దేవదాసు.. పాత్ర.. కథ గురించి చెప్పి.. మిమ్మల్ని హీరోయిన్‌గా తీసుకుంటున్నారు.. అని చెప్పారు. అయితే..దీనిపై తాను ఆలోచించి చెబుతానని భానుమతి చెప్పారు. ఇక, భానుమతి పాత్రల ఎంపికలో ఆమె ఎక్కువగా తన తల్లిపై ఆధారపడే వారని అప్పట్లో ప్రచారం ఉండేది.
ఈ క్రమంలోనే తల్లికి చెప్పగా.. ఈ సినిమాలో హీరోయిన్ కు స్కోప్ తక్కువ. పైగా.. తాగుబోతు పక్కన నటించాలి.. అందునా బెంగాలీ కథ. వద్దులే. దీనివల్ల కెరీర్ దెబ్బతింటుంది అని తెగేసి చెప్పారట. దీంతో భానుమతి ఆ పాత్రను వదిలేసుకుంది. అయితే.. వేదాంతం వారు సావిత్రిని సెట్ చేసుకునే వరకు కూడా భానుమతి కోసం ప్రయత్నిస్తూనే ఉండడం గమనార్హం. ఇక, ఆ సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా..!
సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాలో ఆ పాత్రను మలిచిన తీరుకు భానుమతి ఫిదా అయిపోవడంతో పాటు తాను జీవితంలో ఈ పాత్ర వదులుకుని అతిపెద్ద తప్పు చేశానని ఫీల్ అయ్యారట.