వ్యక్తిగత జీవితంలోనే కాకుండా.. సినిమాల్లోనూ క్రమశిక్షణకు పెట్టింది పేరు ఎన్టీఆర్. ఔట్ డోర్ అయినా.. ఇండోర్ అయినా.. ఆయన సమయపాలనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ఒక్కనిముషం వేస్ట్ చేస్తే.. నిర్మాతలకు వేలల్లో(ఆరోజుల్లో) నష్టం వస్తుందని బాహాటంగానే చెప్పేవారు. ఇలా.. ఆయన టైం టేబుల్ ప్రకారం.. షెడ్యూల్ ప్రకారం.. స్పాట్‌లో ఉండేవారు.
అయితే, కొందరు మాత్రందీనిని పట్టించుకునేవారు కాదు. దీంతో ఎన్టీఆర్ అలాంటి వారిపై రుసరుస లాడేవారు. సీనియర్లయినా.. జూనియర్లయినా.. ఆయన అస్సలు సహించేవారు కాదు. ఇలా.. ‘బంగారు మనిషి’ చిత్రంలో లక్ష్మి హీరోయిన్‌గా నటించారు. తొలి సినిమాలోనే ఆమెకు ఎన్టీఆర్ సమయపాలనపై క్లాస్ తీసుకున్నారు. ఈ అనుభవంతో ఎన్టీఆర్ సెట్‌లో రావడానికి ముందే మేక్‌పతో సిద్ధంగా ఉండేవారు లక్ష్మి.
అయితే ఒక రోజు అనుకోకుండా ఆమెకు లేట్ అయింది. దీంతో హడలి పోయారు. పైగా తొలి షాట్ తనపైనే తీయాల్సి ఉందని మేనేజర్ చెప్పేశాడు. కానీ, లేటైపోయింది. దీంతో భయపడుతూనే ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి ‘సారీ సార్.. కొంచెం లేట్ అయింది’ అని చెప్పారు లక్ష్మి. ఎన్టీఆర్ చిరునవ్వుతో ‘ఇట్సాల్ రైట్’ అన్నారు. షూటింగ్ ప్రారంభమై.. రెండు షాట్లు తీశారు.
అనంతరం.. ఎన్టీఆర్ లక్ష్మిని పిలిచి.. నువ్వెందుకు లేటుగా వచ్చావని నేను అడగను.. దీనికి సవాలక్ష కారణాలు చెబుతావు. నాకు తెలుసు.. కానీ, లేట్‌గా వచ్చినందుకు మీకు శిక్ష విధించాల్సిందే అని అన్నారు. దీంతో లక్ష్మి మరింత హడలి పోయారు. శిక్ష అంటే.. తదుపరి చిత్రాల్లో ఛాన్స్ లేకుండా చేస్తారేమో.. అని తల్లడిల్లిపోయారు. అయితే.. ఎన్టీఆర్ మాత్రం తనకోసం ఇంటి దగ్గర నుంచి వచ్చిన టిఫిన్ అంతా ఆమెతో తినిపించారు.
అయితే.. టిఫిన్ అంటే.. అన్నగారికి మామూలుగా ఉండదు. అరడజను ఇడ్లీలు, రెండు రకాల చెట్నీలు.. నాలుగు దోశలు.. గిన్నెడు ఉప్మా.. ఇవన్నీ లక్ష్మితో తినిపించేసరికి ఆమె అల్లాడిపోయారు. చాలా రోజులు ఈ విషయాన్ని ఆమె గుర్తు చేసుకోవడం గమనార్హం.