నటరత్న ఎన్టీఆర్, నటశేఖర కృష్ణ ఇద్దరూ కూడా నటనా పరంగాను, రాజకీయంగాను, ఇటు వ్యక్తిత్వంగాను రెండు భిన్న ధృవాలకు చెందిన వారుగానే కొనసాగారు. ఇటు సినీ రంగంలోనూ వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ నడిచింది. కొన్ని సినిమాల్లో వీరు కలిసి నటించారు. అలాగే కొన్నిసార్లు వీరిద్దరి సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అయ్యాయి. అయినా కూడా వీరిద్దరి ఆలోచనలు నార్త్, సౌత్‌లాగా ఉండేవి. రాజకీయంగా కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపిస్తే, కృష్ణ కాంగ్రెస్ వైపు నిలిచారు.
అయితే గమ్మత్తు అయిన విషయం ఏంటంటే కృష్ణ చదువుకునే రోజుల్లో ఎన్టీఆర్‌కు వీరాభిమాని. చిన్న వయస్సులోనే కృష్ణ తెనాలి రత్నా టాకీస్‌లో ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి సినిమా చూశారు. ఆ రోజు నుంచే ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం పెంచుకున్నారు. ఆ తర్వాత కూడా కృష్ణకు సినిమాలపై ఆసక్తి పెరిగి మిగిలిన హీరోల సినిమాలు చూసినా ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టపడేవారు. ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే కృష్ణ చూసేయాల్సిందే.
ఇక కృష్ణ నటుడు అవ్వాలన్న కోరికతో మద్రాస్ వెళ్లినప్పుడు కూడా ముందుగా ఎన్టీఆర్‌నే కలిశారు. ఆ సమయంలో ఎన్టీఆర్ సీతారామ కళ్యాణం సినిమా తీస్తున్నారు. అప్పుడు విజయా సంస్థ అధినేతల్లో ఒకరు అయిన చక్రపాణి కృష్ణను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేశారు. అప్పటకీ కృష్ణ వయస్సు కేవలం 19 ఏళ్లు మాత్రమే. అయితే కృష్ణ సినిమాల్లో నటిస్తానని చెప్పగా అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. రెండేళ్లు నాటకాల్లో నటించాకే సినిమాల్లోకి రావాలని సలహా ఇచ్చారు.
సినిమాల్లోకి వచ్చాక కృష్ణ తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. చాలా సినిమాల్లో ఎన్టీఆర్ అన్నగా, కృష్ణ తమ్ముడిగా నటించడంతో ఎన్టీఆర్‌ను కృష్న అన్నగారు అని పిలవడం అలవాటు అయిపోయింది. నిలువుదోపిడి సినిమాలో కృష్ణను తన తమ్ముడి పాత్రకు ఎన్టీఆర్ స్వయంగా రికమెండ్ చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సినిమాల పరంగా పోటీ ఏర్పడి కోల్డ్‌వార్ మొదలైంది.
ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు సినిమా చేయాలని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల అది లేట్ అయ్యింది. అయితే ఈ లోగా కృష్ణ ఈ సినిమాను ఎనౌన్స్ చేశారు. అయితే కృష్ణ, విజయనిర్మలను పిలిపించుకున్న ఎన్టీఆర్ ఈ సినిమా నేను చేయను.. మీరు కూడా చేయవద్దని సూచించారు. ఎన్టీఆర్ ఇలా చెప్పడానికి ఓ కారణం కూడా ఉంది. సీతారామరాజు పాత్ర, ఆయన నిజజీవితాన్ని ఉన్నది ఉన్నట్టు చేస్తే ప్రేక్షకులు చూడరు…. అది ఆ మహానీయుడికి సరైన గౌరవం కాదని ఎన్టీఆర్ భావించారు.
అయితే ఎన్టీఆర్ మాట పక్కన పెట్టేసిన కృష్ణ ఈ సినిమా చేయడం ఎన్టీఆర్ ఆగ్రహానికి కారణమైంది. కట్ చేస్తే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రాజకీయంగా కూడా ఇద్దరి దారులు వేర్వేరు కావడంతో ఈ కోల్డ్‌వార్ కొన్నాళ్ల పాటు కొనసాగింది.