సినీరంగంలో ఉన్న వారి గురించి వింటే.. చాలు చాలు అనే మాటే వినిపిస్తుంది. ఎందుకంటే..అనేక ఆరోపణలు. విమర్శలు.. వివాదాలు మాత్రమే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా పాతతరం హీరోయిన్ల గురించి.. హీరోల గురించి ఎవరైనా మాట్లాడితే.. వారి వ్యక్తిగత అలవాట్లు.. అప్పులు.. తుదిదశలో వారు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు.. అనే సంగతులే కొకొల్లలుగా ఉంటాయి. అయితే.. ఇవి ఎలా ఉన్నప్పటికీ.. అన్నగారు. ఎన్టీఆర్ మాత్రం తాను రాజకీయాల్లోకి వచ్చే వరకు కూడా సినీరంగంలో తనతో నటించిన హీరోయిన్లను ఎంతో అప్యాయతతోనే చూసుకునేవారట.
అంతేకాదు.. పేరుపేరునా.. ఆయన వారి ఇంటికి వెళ్లి.. తన ఇంట్లో జరిగే శుభకార్యాలకు రావాలని.. పిలిచేవారట. ఇలా.. అనుబంధం ఏర్పరుచుకున్నవారిలో శ్రీదేవి నుంచి వాణి శ్రీ వరకు.. సావిత్రి నుంచి భానుమతి వరకు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా వాణిశ్రీతో అయితే.. అన్నగారి కుటుంబానికి కూడా ఎంతో ఆత్మీయ సంబంధం ఉంది. సినిమా ఏది ప్రారంభమైనా.. `అమ్మడు`ను పిలిచేవారట. వాణిశ్రీకి ఎన్టీఆర్ పెట్టుకున్నపేరు అమ్మడు. అంతేకాదు.. సినిమా రోజు ఆమెతో కొబ్బరికాయ కొట్టించి.. పట్టు చీర పెట్టి .. సారె ఇచ్చేవారట.
ఇక, ఇతర హీరోయిన్లను కూడా తన ఇంట ఏ శుభకార్యం జరిగినా.. ఇంటికి పిలిచి.. భోజనం పెట్టి.. సత్కరించి.. సారె ఇచ్చి పంపించేవారట. ఇలా.. జమున అయితే..అనేక సందర్భాల్లో అన్నగారి ఇంట్లో భోజనం చేశానని.. స్వయంగా చెప్పుకొన్నారు. ఎన్టీఆర్ భార్య బసవతారకం తమను ఎంతో ప్రేమతో చూసుకునేవారని జమున చెప్పారు.
వాణిశ్రీ, వైజయంతి మాల, అంజలీదేవి.. భానుమతి వంటివారు చెన్నైలో సెటిల్ అవడంతో వారితో కన్నా.. జమునతో అన్నగారికి మరింత చనువు ఉండేది. అన్నగారే జమునకు ఇల్లు కొనుక్కోమని సలహా ఇచ్చి.. ప్రభుత్వంలో అనుమతులు కూడా మంజూరు చేయించారు. ఇప్పుడు హీరో, హీరోయిన్ల మధ్య చూస్తున్న పరిస్థితికి.. అప్పటి పరిస్థితి ఇంత తేడా ఉంటుందా ? అనే సందేహం వచ్చేలా అన్నగారి డైరీలో హీరోయిన్లకు ప్రత్యేక పేజీ ఉందనేది వాస్తవం.