సినీ ఫీల్డులో ఒకరుధరించిన పాత్రను మరొకరు ధరించకూడదని ఏమీ లేదు. ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవకాశం వచ్చినా.. వారు ఆయా పాత్రలు ధరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. కొందరికి మాత్రమే కొన్ని పాత్రలు నప్పుతాయనే పేరుంది. ఇలాంటివారిలో అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యులు. ఆయన నటించి న అనేక పాత్రలు.. వేరే నటులు వేసినా.. అవి అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. పైగా.. ఆ పాత్రల్లోనూ అన్నగారినే ఊహించే ప్రేక్షకులు కోకొల్లలుగా ఉన్నారు.
ఇలాంటి పాత్రల్లో ఒకటి శ్రీకృష్ణుడి వేష ధారణ. అన్నగారు ఎన్టీఆర్ సూట్ అయినట్టు.. ఇతర ఏ నటులు ఈ పాత్రలో లీనం కాలేదు. అంతేకాదు.. అనేక చిత్రాల్లో ఆయన శ్రీకృష్ణుడి పాత్రలు పోషించారు. కొన్ని కొన్ని సార్లు అన్నగారి కాల్ షీట్లు బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన కోసం వేచి చూసి మరీ.. చిత్రాలను నిర్మించిన నిర్మాతలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. దీనికి ఉదాహరణే మాయాబజార్. ఆయన కోసం వేచి చూసి మరీ.. విజయా కంబైన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
ఇలా.. అన్నగారు కృష్ణుడి వేషంలో మురిపించారు.. మెరుపులు మెరిపించారు. అయితే.. శ్రీకృష్ణుడు అనగానే.. ఆయన భార్యలు, గోపికలు ఇలా ఎంతో మంది మనకు గుర్తుకు వస్తారు. ఇలానే.. ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాత్రలో నటించినప్పుడు.. రుక్మిణి, సత్యభామలుగా అనేక మంది హీరోయిన్లు నటించారు. అంజలీదేవి, మహానటి సావిత్రి, కృష్ణకుమారి, వాణిశ్రీ.. ఇలా చాలా మంది హీరోయిన్లు.. రుక్మిణి, సత్యభామ పాత్రలు పోషించారు. కానీ, ఎన్టీఆర్ సరసన నటించిన ఒకే ఒక్క హీరోయిన్‌కు మాత్రమే క్రేజ్ వచ్చింది.
ఆమే నాటి తరం హీరో యిన్ జమున. ఒకింత పొగరు.. మరింత గర్వాలకు ప్రతీక అయిన.. సత్యభామ పాత్రలో జమున ఒదిగిపోయిన తీరు..నభూతో అని అనిపించక మానదు. అందుకే సత్యభామలుగా ఎందరు చేసినా జమున పాత్రనే ఆయన అంతగా ఇష్టపడేవారు. అన్నగారు.. కృష్ణుడుగా.. జమున సత్యభామగా రెండు చిత్రాల్లో నటించారు. ఆ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్లు కావడం గమనార్హం. అంతేకాదు.. ఎన్టీఆర్ సరసన సత్యభామగా జమునకు ఎనలేనిపేరు వచ్చింది.