సినీ రంగంలో అన్నగారు ఎన్టీఆర్ వేయని వేషం అంటూ.. ఏమీలేదు. ఆయన చేయని పాత్ర అంటూ కూడా లేదు. పిచ్చిపుల్లయ్య నుంచి శ్రీకృష్ణుడు… రాముడు.. పంతులుగారు.. ఇలా అనేక వేషాలు వేశారు. అటు పౌరాణికం.. ఇటు గ్రాంధికం.. సామాజికం.. చారిత్రకం, జానపదం అన్ని కోణాలను అన్నగారు స్పృశించారు. అయితే.. ఇలా ఎన్ని వేషాలు వేసినా.. అన్నగారికి ఇబ్బందిగా మారింది.. ఒకే ఒక పాత్ర. అదే శివుడి వేషం అంటారు. ఆయన రెండు సినిమాల్లో శివయ్యగా నటించారు.
ఒకటి దక్షయజ్ఞం. ఈ సినిమాలో అన్నగారు అద్భుతమైన నటనతో శివయ్య పాత్రలో ఒదిగిపోయారు. దక్షయజ్ఞం సినిమాలో ఎన్టీఆర్ శివుడిగా నట విశ్వరూపం చూపించేశారు. శివతాండవంతో ఊగిపోవడం తెరమీద చూస్తే జనాలు మెస్మరైజ్ అయిపోయారు. అయితే.. ఆ సినిమా షూటింగు జరుగుతున్న సమయంలోనే ఆయన కుమారుడు మరణించారు. దీనికి కారణం.. శివుడి వేషమేననే ప్రచారం జరిగింది.
అయితే.. అన్నగారు కొన్ని కొన్ని సార్లు సెంటిమెంటు నుకూడా పక్కన పెట్టేవారు. ఈ క్రమంలోనే తదుపరి మరో చిత్రంలోనూ ఆయన శివయ్య పాత్ర ధరించారు. దీంతో ఏకంగా ఆయన కారుకే యాక్సిడెంట్ అయింది. ఈ విషయం తెలిసిన..అప్పటి దిగ్గజ దర్శకుడు విఠలాచార్య.. అన్నగారి జాతకం పరిశీలించి.. శివయ్య వేషాన్ని వేయొద్దని సూచించారట. ఇక అప్పటి నుంచి అన్నగారు ఆ వేషానికి దూరంగా ఉన్నారు.
అయితే.. తన సినిమాల్లో శివుడి వేషం వేయాల్సి వస్తే.. ఆ పాత్రకు వేరేవారిని తీసుకునేవారు. ఈ క్రమంలో అన్నగారు ఎక్కువగా శోభన్‌బాబు లేదా.. నాగభూషణాన్ని సిఫారసు చేసేవారట. వారికి కూడా తగు సూచనలు చేసేవారట. చాలా నిష్టగా ఉండాలని.. చెప్పేవారట. ఏదేమైనా.. అన్నగారికి కలిసిరాని పాత్ర అంటూ.. ఉంటే ఒక్క శివయ్య పాత్రేననే వాదన మాత్రం సినీ రంగంలో ఉంది.