ప్రస్తుతం మనం టాలీవుడ్‌లో ఒకప్పుడు రిలీజ్ అయిన సినిమాల పేర్లతోనే తిరిగి సినిమాలు చేస్తున్నారు. పాత సినిమాల టైటిల్స్‌నే వాడడానికి కారణం టైటిల్స్ కొరత ఉండడం ఒక కారణం అయితే… రెండో కారణం డబ్బింగ్ సినిమాలకు వేరే దారి లేక ఇదే టైటిల్స్ వాడుకుంటున్నారు. గతంలో ఓ టైటిల్‌తో ఓ సినిమా వస్తే మళ్లీ అదే టైటిల్‌తో సినిమా రావడానికి చాలా టైం పట్టేది. ఇప్పుడు చాలా తక్కువ టైంలోనే టైటిల్‌ను మళ్లీ రిపీట్ చేసి సినిమాలు తీసేస్తున్నారు.
గతంలో ఎన్టీఆర్ చేసిన టైటిల్‌తోనే బాలయ్య ఎన్నో సినిమాలు చేశారు. ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు చేసి హిట్ కొట్టిన ఘనత బాలయ్య, ఎన్టీఆర్‌కే దక్కుతుంది. ఇదిలా ఉంటే బాలయ్య – సీనియర్ నటుడు శోభన్ బాబు కూడా ఒకే టైటిల్‌తో సినిమాలు చేశారు. వీరిద్దరు నటించిన ఆ టైటిల్ ఏది ? ఆ సినిమాల ఫలితాలు ఏంటో చూస్తే ఆసక్తిగా అనిపిస్తుంది.
1970 లో శోభన్ బాబు హీరోగా తల్లిదండ్రులు అనే సినిమా విడుదల అయింది. ఈ సినిమాలో శోభన్‌బాబుకు జోడీగా చంద్రకళ నటించింది. ఈ సినిమాలో శోభన్‌బాబుకు తల్లిగా మహానటి సావిత్రి, తండ్రిగా జగ్గయ్య నటించారు. కుటుంబం కంటే సమయానికే జగ్గయ్య ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది నచ్చని సావిత్రి తన కొడుకును తీసుకుని దూరం వెళ్లిపోతుంది. ఆ కొడుకే శోభన్‌బాబు.. చివరకు వీళ్లు ఎలా కలిశారు ? అన్నదే స్టోరీ. అయితే ఈ సినిమా అభిమానులను అంతగా అలరించలేదు. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ అయ్యింది.
1991లో బాలయ్య హీరోగా మళ్లీ అదే టైటిల్‌తో మరో సినిమా వచ్చింది. విజయశాంతి హీరోయిన్. తాతినేని రామారావు దర్శకుడు. ఉమ్మడి కుటుంబంలో పుట్టిన బాలకృష్ణ పనిపాటా లేకుండా డబ్బు బాగా ఖర్చు చేస్తూ ఉంటాడు. ఇక డ్యాన్స్ టీచర్‌గా పనిచేసే విజయశాంతికి, బాలయ్యకు అస్సలు పడదు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వీరు ప్రేమలో పడతారు.
ఇక బాలయ్య కూడా కుటుంబం గురించి తెలుసుకుని మారతాడు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సూపర్ హిట్ అయ్యింది. అలా తల్లిదండ్రులు టైటిల్‌తో సినిమా చేసిన ఈ ఇద్దరు హీరోల్లో బాలయ్య సూపర్ హిట్ కొడితే… శోభన్‌బాబు సినిమా యావరేజ్‌గా నిలిచింది.