సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ బాధ చెప్పుకోలేనిది. ఆమె ఎప్పుడూ ఏదో ఒక వార్తలతో మీడియాలో నానుతూనే ఉంటోంది. కొన్నేళ్ల క్రితం ఆమెను అసభ్యంగా టార్గెట్ చేస్తూ కొన్ని వెబ్‌సైట్లు, మీడియా ఛానెల్స్ వార్తలు వేశాయని ఆమె సైబర్ క్రైంను ఆశ్రయించారు. తాను కొన్ని సినిమాల్లో నటించిన సీన్లను… ప్రాముఖ్యత పరంగా, కథా పరంగా మాత్రమే అవి అశ్లీలంగా ఉన్నట్టు ఉంటాయే తప్పా.. ఆ క్యారెక్టర్లు తనకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టాయని.. ఆ సీన్లను చూపిస్తూ తాను ఏవేవో అశ్లీల సీన్లలో చేసినట్టుగా చూపిస్తున్నారంటూ ఆమె వాపోయారు.
తర్వాత ఈ వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్‌పై పోరాటం చేయాలని ఆమె అప్పటి మా అధ్యక్షుడు నరేష్ దగ్గర కూడా మొత్తుకున్నారు. అయితే తన ఆవేదన నరేష్ పట్టించుకోలేదు సరికదా ? పైగా మీడియా వాళ్లతో మనకెందుకు అన్నారని కూడా హేమ బాధపడింది. ఇక ప్రతిసారి మా ఎన్నికలు జరుగుతున్నప్పుడు హేమ పేరు హైలెట్ కాకుండా ఉండదు. ఇక తాజాగా బంజారాహిల్స్ క్లబ్‌లో జరిగిన డ్రగ్స్ దాడుల వ్యవహారంలో హేమ పేరు బయటకు వచ్చింది.
ఓ ప్రముఖ మీడియా ఛానెల్లో హేమ కూడా ఉందన్న పేరుతో ఆమె అగ్గిమీద గుగ్గిలం అయిపోయింది. దీంతో ఆమె బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి మీడియాపై సహజంగానే తన అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు పబ్‌కే రాని తన పేరు ఎలా ప్రచారంలోకి తెస్తారంటూ ఆమె మీడియాపై ఆవేశంతో ఊగిపోయింది. తన పేరు ప్రస్తావించిన ఛానెళ్లపై ఫిర్యాదు చేస్తానని అన్నారు.. తనకు కూతురు, కుటుంబం ఉందని కాస్త ఆవేదన స్వరంతోనే మాట్లాడారు.
ఏదేమైనా హేమను మీడియాలో కావచ్చు.. సోషల్ మీడియాలో కావచ్చు.. కొందరు పనిగట్టుకుని టార్గెట్ చేస్తోన్న వాతావరణమే ఉంది. వీళ్లే ఆమెను టార్గెట్ చేస్తోన్న వాతావరణం ఉంది. పోనీ సోషల్ మీడియా వాళ్లు అంటే వ్యూస్ కోసమో లేదా యూట్యూబ్‌లో క్లిక్స్ కోసమే ఆమెపై ఏదో నిరాధార వార్తలు, స్టోరీలు వేశారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆమెపై ఈ తరహా వార్తలు ఎందుకు వేస్తోందన్నదే అర్థం కాని ప్రశ్న. ఏదేమైనా ఇలాంటి విషయాల్లో వాస్తవాలు తెలియకుండా ఎవ్వరిని బయటకు లాగడం మీడియాకు సరికాదేమో ?
హేమ డ్రగ్స్ తీసుకుందన్న ప్రచారం ఆమె కెరీర్‌కే నష్టం కలిగేలా చేస్తుంది. ఒకసారి ఈ తరహా వార్తలపై ఆమె వచ్చేశాయంటే.. ఆమె తప్పు చేయకపోయినా కూడా పదే పదే హేమ – డ్రగ్స్ అంటూ ఎవరికి వాళ్లు అనేక సందేహాల్లోకి వెళ్లిపోతారు. ఇలాంటి విషయాల్లో ఒక్క హేమ మాత్రమే కాదు.. సెలబ్రిటీల్లో చాలా మంది బాధితులు ఉన్నారు. నిన్న ఇష్యూలోనే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ పేరు కూడా బయటకు రాగా.. వాళ్లు వెంటనే తమ పీఆర్వో టీంతో ఖండన ఇప్పించుకున్నారు.