టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబును స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా ఒక్కడు. రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి మహేష్ కు స్టార్డం వచ్చింది మాత్రం ఒక్క సినిమాతోనే..
రాజకుమారుడు తర్వాత యువరాజు – వంశీ – బాబి లాంటి ప్లాప్ సినిమాలతో మహేష్ కెరీర్ లో ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక్కడు సినిమా వచ్చింది. 2003 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ నాగ సినిమాకు పోటీగా రిలీజ్ అయింది.
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పై ఎమ్మెస్ రాజు నిర్మించిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకుడు. భూమిక హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్ విలనిజం… మహేష్ బాబు హీరోయిజం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అన్నింటికీ మించి గుణశేఖర్ స్క్రీన్ ప్లే, టేకింగ్ ఒక్కడు సినిమాను చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా చేసింది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో యూత్‌ను ఎంతో ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్ డైలాగులు థియేటర్లో ప్రేక్షకుల చేత విజిల్ కొట్టించాయి.
గుణశేఖర్ సినిమా అంటే భారీ సెట్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఒక్కడు సినిమా కోసం చార్మినార్ సెట్ వేశారు. ఈ సెట్ కోసం అప్పట్లో మూడు కోట్లు ఖర్చు చేయటం ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆ రోజుల్లోనే ఒక్కడు సినిమా 130 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. అప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో ఉన్న రికార్డులను తిరగరాసింది. అయితే ఈ సినిమా ముందుగా మహేష్‌బాబుతో చేయాలని అనుకోలేదట. నిర్మాత ఎమ్మెస్ రాజు మహేష్ తో ఒక సినిమా చేయాలని వెళ్లి ఒక్కడు సినిమా కథ వినిపించారట.
మహేష్ బాబుకు కథ నచ్చింది.. అయితే అప్పట్లో మహేష్‌కు శాఖమూరి రాంబాబు అనే వ్యక్తి మేనేజర్‌గా ఉండేవాడట. గుణశేఖర్… మహేష్ బాబుకుకు పూర్తి కథ వినిపించేందుకు మేనేజర్ రాంబాబుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మహేష్ పడుకున్నాడు అని… వేరే పనుల్లో బిజీగా ఉన్నారు అంటూ సమాధానం చెప్పాడట. దీంతో అసలు గుణశేఖర్ మహేష్ కు ఈ సినిమా పట్ల ఆసక్తి ఉందా లేదా ? ఆయన ఒక్కడు సినిమా చేస్తారా లేదా అని డైలమాలో పడిపోయాడు అట.
మహేష్ బాబుకు ఈ కథ ఇష్టం లేదేమో అన్న సందేహంతో ఈ కథను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేదా విక్టరీ వెంకటేష్‌తో చేస్తే ఎలా ? ఉంటుంది అన్న ఆలోచన కూడా దర్శక నిర్మాతలు చేశారట. అప్పటికే ఎం.ఎస్.రాజు విక్టరీ వెంకటేష్ తో దేవి పుత్రుడు లాంటి భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో ఆయన వెంకటేష్‌తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు.
మహేష్ నుంచి రిప్లే రాకపోవడంతో పవన్ కళ్యాణ్ లేదా వెంకటేష్ తో కమిట్ అయిపోదాం అనుకుంటున్న సమయంలో మహేష్ బాబు ఎమ్మెస్ రాజుకు ఫోన్ చేసి తాను ఒక్కడు సినిమా చేస్తున్నా అని చెప్పారట. దీంతో ఎం.ఎస్.రాజుతో పాటు దర్శకుడు గుణశేఖర్ ఊపిరి పీల్చుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. చివరకు ఆ సినిమా మహేష్ బాబుకు సూపర్ స్టార్ డం తెచ్చిపెట్టింది. ఒకవేళ మహేష్ ఓకే చెప్పకపోయి ఉంటే ఈ హిట్ వెంకీ లేదా పవన్ ఖాతాలో చేరిపోయి ఉండేది.