ఎన్టీయార్ టాలీవుడ్ టాప్ స్టార్. తొలితరం సూపర్ స్టార్. ఆయన సినిమాకు కాల్షీట్లు ఇచ్చారు అంటే ఆ నిర్మాతకు ఇక కాసుల పంటే. ఎన్టీయార్ గ్రాఫ్ 1970 దశకం మొదట్లో కొంచెం నెమ్మదించినా 1975లో వచ్చిన ఎదురులేని మనిషి మూవీతో మళ్లీ స్టార్ తిరిగింది. ఆ మూవీతో ఎన్టీయార్ డ్యాన్సులు స్టార్ట్ చేశారు. కొత్త తరానికి యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఆయన గెటప్స్ కూడా మార్చుతూ పోయారు.
ఇక ఎదురులేని మనిషి సూపర్ హిట్ తరువాత వచ్చిన అడవిరాముడు తో కమర్షియల్ హీరోగా ఎన్టీయార్ చరిష్మా పీక్స్ కి చేరింది. అది ఆయన పాలిటిక్స్ లో చేరేంతవరకూ అలా సాగుతూనే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీయార్ రాజకీయాల్లోకి వచ్చే నాటికి కూడా బిజీ హీరోగా ఉన్నారు. ఆ రోజుల్లో ఎన్టీయార్ ఒక సినిమాకు కనీసం మూడు నెలలు కేటాయించేవారు. అలా ఏడాదికి నాలుగు సినిమాలు చేసేవారు.
ఆయన సడెన్ గా పొలిటికల్ ఎంట్రీ మీద డెసిషన్ తీసుకోవడంతో అప్పటిదాకా ఆయన వద్ద ఉన్న పలువురు ప్రముఖ నిర్మాతలతో ఉన్న కమిట్మెంట్స్ అలా ఉండిపోయాయి. ఇక ఎంటీయార్ 1982లో పార్టీ పెట్టిన తరువాత చైతన్య రధం మీద ఏపీ అంతా టూర్ చేశారు. 1983లో గెలిచి ఆయన సీఎం అయిపోయారు.
దాంతో ఎన్టీయార్ చేతిలో ఉన్న అర డజన్ కి పైగా ఉన్న సినిమాల పరిస్థితి అయితే అలాగే ఉండిపోయింది అంటారు. ఇక్కడ మరో ముచ్చట చెప్పుకోవాలి. ఎన్టీయార్ రాజకీయ ప్రవేశం గురించి ప్రకటన చేశారు. కానీ ఏకంగా తన పార్టీ అధికారంలోకి వచ్చి తాను సీఎం అవుతాను అని పెద్ద ఆశలేవీ పెట్టుకోలేదుట. దాంతో ఎన్నికలు అయిపోతే తిరిగి వచ్చి సినిమాలు చేద్దామని నిర్మాతలకు చెప్పి ఉంచారుట.
కానీ అనూహ్యంగా ఆయన సీఎం కావడంతో ఆయనతో కమిట్ అయిన నిర్మాతలకు ఏం చేయాలో పాలుపోలేదు. అయితే ఎన్టీయార్ మాత్రం అందరికీ సినిమాలు చేయకపోయినా ఒక ఇద్దరు నిర్మాతలకు మాత్రం మీరిద్దరూ కలసి నిర్మిస్తే ఒక సినిమా చేస్తాను అని హామీ ఇచ్చారుట.
అలా రూపొందిందే నా దేశం మూవీ. ఈ సినిమాను దేవీ ఫిలిమ్స్ అధినేత దేవీ వరప్రసాద్, పల్లవి మూవీస్ నిర్మాత వెంకటరత్నం కలసి నిర్మించారు. కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లో ఈ మూవీ తయారైంది అంటే నమ్మాల్సిందే. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత సూపర్ డూపర్ హిట్ అయింది. దటీజ్ ఎన్టీయార్.