దర్శకుడు కొరటాల శివ తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఐదు సినిమాలు తీశాడు. ప్రతి సినిమాకు కథనం మాత్రమే మారుతూ వస్తోంది. కథ కాస్త అటూ ఇటూగా ఒక్కటే ఉంటోంది. హీరో ఎవరో తన ఐటెండీ ముందుగా బయట పెట్టడు. సామాన్యుడిగా ఉంటాడు. ఆ తర్వాత హీరో ఎవరో అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుస్తోంది. బాషా, నరసింహానాయుడు, ఇంద్ర కూడా ఇదే స్టైల్లో ఉంటాయి. కొరటాల సినిమాలు అంతే.
హీరో తన ఐటెండీ ఏంటో బయట పెట్టకుండా ఓ ఊరు వెళ్లి అక్కడ ఉంటూ తన సమస్యలు పరిష్కరిస్తూ ఉంటాడు. కొరటాల సినిమాల్లో హీరో అక్కడ ఉండడు. ఏదో ఓ స్పెషల్ పనిమీద ఆ ఊరు వస్తాడు. ట్రైలర్ చూస్తే రేపు రిలీజ్ అయ్యే ఆచార్య కూడా అదే జానర్ అనేలా ఉంది. అంటే ఒకే కథను కాస్త అటూ ఇటూగా మార్చేసి.. తనదైన కథనంతో ఐదు సినిమాలు తీయడం కొరటాలకే చెల్లిందని అనుకోవాలి.
కొరటాల మొదటి సినిమా మిర్చిని తీసుకుంటే ప్రభాస్ ఎక్కడ నుంచో వచ్చి ప్రత్యర్థులను తన ఫ్యామిలీ నుంచి రక్షించుకుంటాడు. శ్రీమంతుడులో మహేష్‌బాబు తాను ఎవరో చెప్పకుండా ఓ పల్లెకు వెళ్లి అక్కడ సమస్యలు పరిష్కరిస్తాడు. జనతా గ్యారేజ్‌లో ఎన్టీఆర్ కూడా తాన ఐడెంటీ ఏంటో చెప్పకుండా కుటుంబంలోకి వెళ్లి అక్కడే ఉంటాడు.
ఇక భరత్ అనే నేను కాస్త డిఫరెంట్గా అనిపిస్తుంది. అయితే ఇందులో కూడా హీరో బయట నుంచే వస్తాడు. మిర్చిలో కుటుంబ సమస్య – శ్రీమంతుడులో ఊరి సమస్య – జనతా గ్యారేజ్‌లో కుటుంబంతో పాటు సమాజం సమస్య – భరత్ అనే నేనులో రాష్ట్రం సమస్య – ఇప్పుడు ఆచార్యలో కూడా మళ్లీ ఊరి సమస్య గురించి ప్రస్తావిస్తున్నారు.
ఇక హీరో ఓ ఊరు, లేదా రాష్ట్రం.. నాలుగు ఫైట్‌లు, కొన్ని ఎమోషనల్ డైలాగులు, హీరోయిన్‌తో నాలుగు లవ్ సీన్లు… ఒకే ఫార్ములాతో హిట్లు కొట్టేస్తున్నాడు. కొరటాల దగ్గర ఉన్న వస్త్రం కూడా ఒక్కటే అంటున్నారు. ఓ సారి కోటు.. మరోసారి లాల్చీ, ఆ తర్వాత షర్ట్ కుడతాడు.. ఇప్పుడు చిరంజీవికి ఆచార్యలో నక్సలిజం యూనీఫాం కుట్టేశాడు.
సరే కథ ఎలా ఉంది.. అటూ ఇటూ తిప్పేస్తున్నాడా ? అన్న దాని కంటే ఆ కథను ఎలా చెప్పి ప్రేక్షకులను కన్విన్స్ చేసి తన సినిమాలతో హిట్లు కొడుతున్నాడు అన్నదే ముఖ్యం. అందుకే కొరటాల ఈ రోజు టాలీవుడ్‌లో మాంచి క్రేజ్ డైరెక్టర్ అయిపోయాడు. మరి రేపు ఆచార్య కూడా హిట్ అయితే కొరటాల – ఎన్టీఆర్ సినిమాపై మరింత క్రేజ్ ఉంటుంది.