నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గత ఏడాది డిసెంబర్లో అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య బాక్సాఫీస్ దగ్గర అఖండ గర్జన మోగించారు. అఖండ ఇప్పటికీ కొన్ని థియేటర్లలో రన్ అవుతున్న సంగతి తెలిసిందే. అఖండ ఇచ్చిన శక్తితో బాలయ్య వరుసపెట్టి క్రేజీ దర్శకులతో సినిమాలకు ఓకే చెబుతున్నారు. ప్రస్తుతం మైత్రీ మూవీస్ బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమాలు బాలయ్య నటిస్తున్నారు. ఈ సినిమాకు మలినేని గోపీచంద్ దర్శకుడు.
ఈ సినిమా తర్వాత బాలయ్య మరో బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి ప్రారంభం అవుతుందని అనిల్ రావిపూడి ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే అఖండ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య భుజానికి ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. అఖండ షూటింగ్‌లో జై బాలయ్య సాంగ్ షూట్ జరుగుతున్నప్పుడు ఒక చిన్న ప్రమాదంలో బాలయ్య కుడి భుజానికి గాయం కావడంతో హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో ఆయనకు చిన్న ఆపరేషన్ చేశారు.
ఆ ఆపరేషన్ జరిగిన కొద్ది రోజులకే బాలయ్య అఖండ సినిమా జై బాలయ్య షూటింగ్ లో పాల్గొన్నారు.తాజాగా బాలయ్యకు మరోసారి శస్త్రచికిత్స జరిగింది. బాలయ్య కొద్ది రోజుల నుంచి మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. మోకాళ్ళ నొప్పి కోసం మందులు వాడుతున్నా తగ్గకపోవడంతో మరోసారి వైద్యులు ఆయనకు మోకాళ్ల నొప్పికి చిన్న ఆపరేషన్ చేశారు. కేర్ హాస్పిటల్ వైద్యులు బాలయ్యకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఆపరేషన్ పూర్తి చేశారు.
బాలకృష్ణకు జరిగింది మైనర్ ఆపరేషన్ అని.. ఆయన ఆరోగ్యం పూర్తిగా బాగుందని… ఓ వారం రోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని… బాలయ్య అభిమానులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు సూచించారు. ప్రస్తుతం హాస్పిటల్లో వైద్యులతో పాటు బాలయ్య కలిసి దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. బాలయ్య వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న వెంటనే మలినేని గోపీచంద్ సినిమా షూటింగులో జాయిన్ అయిపోతారు. దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.