సినిమా రంగంలో ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య గొడవలు కామన్. ఇటీవల కాలంలో తెలుగులో ఇవి కాస్త తగ్గుతున్నాయి అనుకుంటోన్న టైంలో మరింత ముదురుతోన్న వాతావరణమే కనిపిస్తోంది. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ ఫ్యాన్స్ మధ్య గొడవలు ఎక్కువ. ఆ తర్వాత చిరంజీవి – బాలయ్య సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఈ ఇద్దరు హీరోల అభిమానులు థియేటర్ల దగ్గర పెద్ద యుద్ధం చేసేవారు. ఏ హీరో అభిమానికి తమ హీరో సినిమాయే గొప్ప అవుతుంది.
అయితే ఇటీవల కాలంలో హీరోల అభిమానుల మధ్య గొడవలు తగ్గుతున్నాయి… ఇది టాలీవుడ్‌కు కాస్త శుభ పరిణామం అనుకుంటోన్న టైంలో ఇప్పుడు మళ్లీ ముదురుతున్నాయి. రెండేళ్ల క్రితం సంక్రాంతికి బన్నీ అల వైకుంఠపురంలో, మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలు వచ్చినప్పుడు ఫ్యాన్స్ బాగా పంతాలకు పోయారు. చివరకు వీరి పంతాలతో ఆయా హీరోలకు తాకాయి. హీరోలు కూడా ఈ వార్‌ను ప్రెస్టేజియస్‌గా తీసుకునే వరకు వెళ్లింది.
అప్పటి నుంచి బన్నీ, మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరోయే గొప్ప అనే వరకు యుద్ధం వెళ్లిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు బన్నీ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వార్ కూడా ముదిరిపోయింది. బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో ముందుకు వెళ్లాడు. ప్రభాస్‌కు బాహుబలి, సాహో సినిమాలతోనే ఆ ఇమేజ్ వచ్చింది. ఇక రాధేశ్యామ్ కూడా పాన్ ఇండియా సినిమాగా వచ్చినా ప్లాప్ అయ్యింది.
ఆ సినిమాకు రు. 400 కోట్లు వచ్చాయని మేకర్స్ చెపుతున్నారు. అయితే ఆ సినిమా బడ్జెట్, జరిగిన బిజినెస్.. వసూళ్లతో పోలిస్తే ఇది ప్లాప్ కిందే లెక్క. సినిమాకు రు. 100 కోట్లకు పైగా నష్టాలు తప్పేలా లేవని ట్రేడ్ కూడా తేల్చేసింది. అయితే ఇటీవలే బన్నీ పుష్ప సినిమాకు రు. 365 కోట్లు వచ్చాయని చెప్పుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ సినిమాకు రు. 400 కోట్లు వచ్చినట్టు మేకర్స్ ప్రకటించుకోవడంతో బన్నీ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
దాని బడ్జెట్ ఎక్కువ అని.. మా సినిమా కంటే ఎక్కువ వచ్చినట్టు చెపుతున్నా .. ఘోరమైన డిజాస్టర్ అని కామెంట్లు చేస్తున్నారు. అసలు ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వార్ ఇప్పటది కాదు.. బాహుబలి సినిమా అప్పటి నుంచే ఉంది. ప్రభాస్‌కు ముందే ఫాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత బన్నీ వరుస హిట్లు కొట్టినా పుష్ప సినిమాతో ఎట్టకేలకు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దీంతో ఎవరికి వారు తమ హీరోయే గొప్ప అని సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్నారు.
ఇక పవన్ ఫ్యాన్స్ కూడా ప్రభాస్‌ను ఆడేసుకుంటున్నారు. రాధేశ్యామ్ థియేటర్లలోకి రావడానికి ముందు భీమ్లానాయక్ ఆడుతోంది. రాధేశ్యామ్ కలెక్షన్లు తగ్గించడానికే కావాలనే భీమ్లానాయక్ ఆడుతోన్న కొన్ని థియేటర్లను ఖాళీ చేయించలేదన్న ఆవేదన ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఉంది. ఇక రాధేశ్యామ్‌కు నెగిటివ్ టాక్ వస్తే భీమ్లానాయక్ పుంజుకుంటుందనే కావాలనే రాధేశ్యామ్‌కు పవన్ ఫ్యాన్స్ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయించారని ప్రభాస్ ఫ్యాన్స్ ఆరోపణ.
అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. ఏపీ ప్రభుత్వం భీమ్లానాయక్‌ను గట్టిగా టార్గెట్ చేసింది. రాధేశ్యామ్‌కు బాగా కోపరేట్ చేసింది. ఇది కూడా పవన్ అభిమానులు రాధేశ్యామ్‌ను టార్గెట్ చేసేందుకు మరో కారణం అయ్యింది. ఏదేమైనా అటు బన్నీ, ఇటు పవన్ ఫ్యాన్స్ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య యుద్ధం అయితే ఇప్పట్లో ఆగేలా లేదు.