ReviewsTL ప్రీ రివ్యూ: RRR ( రౌద్రం - ర‌ణం -...

TL ప్రీ రివ్యూ: RRR ( రౌద్రం – ర‌ణం – రుధిరం)

టైటిల్‌: RRR
బ్యాన‌ర్‌: డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్స్‌
స‌మ‌ర్ప‌ణ‌: డీ పార్వ‌తి
న‌టీన‌టులు: ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, అజ‌య్ దేవ‌గ‌న్‌, అలియా భ‌ట్‌, ఒవీలియో మోరిస్‌, శ్రీయా శ‌ర‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని
క‌స్ట‌మ్ డిజైన‌ర్‌: ర‌మా రాజ‌మౌళి
లైన్ ప్రొడ్యుస‌ర్‌: ఎస్ఎస్‌. కార్తీకేయ‌
పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లైన్ ప్రొడ్యుస‌ర్‌: ఎంఎం. శ్రీవ‌ల్లి
సినిమాటోగ్ర‌ఫీ: కెకె. సెంథిల్ కుమార్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సాబు సిరిల్‌
ఎడిట‌ర్‌: శ్రీక‌ర ప్ర‌సాద్‌
మ్యూజిక్‌: ఎంఎం. కీర‌వాణి
స్టోరీ: విజ‌యేంద్ర ప్ర‌సాద్‌
మాట‌లు: సాయి మాధ‌వ్ బుర్రా
నిర్మాత‌: డీవీవీ దాన‌య్య‌
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: రాజ‌మౌళి
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
ర‌న్ టైం: 186.50 నిమిషాలు
రిలీజ్ డేట్ : 25 మార్చి, 2022

ప‌రిచ‌యం:
బాహుబ‌లి ది కంక్లూజ‌న్ భార‌త‌దేశ పౌరుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డ ఉన్నా రొమ్ము చ‌రిచి గొప్ప‌గా ఇది మ‌న సినిమా అని చెప్పుకునేంత గొప్ప సినిమా. ఓ భార‌తీయుడికే ఇది గొప్ప సినిమా అయిన‌ప్పుడు.. ఓ ప్రాంతీయ భాషా సినిమాగా తెర‌కెక్కినప్పుడు ఇక తెలుగోడు ఈ సినిమా చూసి ఇంకెంత గ‌ర్వంగా ఉప్పొంగిపోతాడో చెప్ప‌క్క‌ర్లేదు. అలాంటి గొప్ప సినిమా తెర‌కెక్కించిన త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన సినిమాయే ఈ రౌద్రం – ర‌ణం – రుధిరం. చ‌రిత్ర కెక్కిన ఇద్ద‌రు తెలుగు వీరుల కాల్పినిక క‌థ‌.. పైగా టాలీవుడ్‌లో నాలుగు ద‌శాబ్దాల చ‌రిత్ర ( నంద‌మూరి ఫ్యామిలీకి అంతకంటే ఎక్కువ‌) ఉన్న నంద‌మూరి – మెగా కుటుంబాల‌కు చెందిన మూడో త‌రం వార‌సులు క‌లిసి న‌టించిన సినిమా కావ‌డంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగోళ్ల‌లోనే కాకుండా.. ఇటు ఇండియా సినీ అభిమానులు ఎక్క‌డ‌.. ఏ దేశంలో ఉన్నా కూడా ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని దేశం ఎల్ల‌లు దాటించి ప్ర‌పంచ వ్యాప్తంగా చాటి చెప్పిన రాజ‌మౌళి ఈ త్రిబుల్ ఆర్‌తో దానిని మ‌రింత ఎత్త‌కు తీసుకువెళ‌తాడ‌న్న అంచ‌నాలే ఉన్నాయి. మ‌రి ఈ సినిమా ఎలా ? ఉండ‌బోతుందో ? తెలుగులైవ్స్‌. కామ్ ప్రి రివ్యూలో చూద్దాం.

స్టోరీ – అంచ‌నా
తెలుగు చ‌రిత్ర‌లో స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు.. బ్రిటీషర్ల‌ను మన్యం కేంద్రంగా చేసుకుని ముప్పుతిప్ప‌లు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించిన అల్లూరి సీతారామ‌రాజుకు ప్ర‌త్యేక స్థానం ఉంది. అల్లూరి పుట్టింది ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం ప్రాంతం అయినా.. ఆయ‌న తూర్పు – విశాఖ ఏజెన్సీలోని రంప‌చోడ‌వ‌రం, మారేడుమిల్లి, పాడేరు కేంద్రంగా బ్రిటీష‌ర్ల‌పై ఎన్నో పోరాట‌లు చేశారు. చివ‌ర‌కు బ్రిటీష‌ర్ల‌కు దొరికిపోవడంతో ప్ర‌భుత్వం ఆయ‌న్ను ఉరి తీసింది. ఇక ఆదిలాబాద్ గోండు జాతి గిరిజ‌నుడు.. నైజాం పాల‌న అరాచ‌కాల‌పై పోరాటం చేసిన గోండు వీరుడు కొమ‌రం భీం. కొమ‌రం భీం నైజాం పాల‌న‌తో పాటు బ్రిటీష‌ర్ల అరాచ‌కాల‌ను కూడా ఎదిరించాడు. వీరిద్ద‌రు కొంత స‌మ‌కాలీనులే అయినా కూడా ఒకేసారి క‌లిసి పోరాటం చేసిన‌ట్టు చ‌రిత్ర‌లో లేదు. అయితే వీరిద్ద‌రు క‌లిసి చ‌రిత్ర‌లో ఒకేసారి పోరాటం చేసి బ్రిటీష‌ర్ల‌ను ఎదిరిస్తే ఎలా ఉంటుంద‌న్న కాల్ఫ‌నిక క‌థ‌తోనే రాజ‌మౌళి ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్టు చెప్పాడు.

న‌టీన‌టుల పెర్పామెన్స్ అంచ‌నా :


ఎన్టీఆర్ :
గోండు గిరిజ‌న జాతికి కాప‌రిగా కొమ‌రం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టించాడు. అడ‌విలో ఉండే ఆ జాతి హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌, వారి మాన‌, ప్రాణాల‌కు ఏ మాత్రం అన్యాయం, అవ‌మానం జ‌రిగినా తెగించి బ్రిటీష‌ర్లను ఎదుర్కొనే ధిశాలిగా ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నాడు. ఇక పులితో ఎన్టీఆర్ ఫైట్ కూడా రొమాలు నిక్క‌పొడిచి క‌న్నార‌ప్ప‌కుండా చూసే రేంజ్‌లో ఉండ‌బోతోంది. ఎన్టీఆర్‌కు జోడీగా బ్రిటీష్ అమ్మాయి ఓవీలియో మోరీస్ న‌టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె పాత్ర‌ను పెద్ద‌గా చూపించ‌లేదు. ఏదేమైనా ఎన్టీఆర్ అరివీర భ‌యంక‌ర‌మైన న‌ట‌న‌ను ఈ సినిమాలో మ‌నం చూడ‌బోతున్నాం.

రామ్‌చ‌ర‌ణ్ :


రామ్‌చ‌ర‌ణ్‌ది సినిమాలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర అని చెప్పినా ట్రైల‌ర్‌లో అత‌డిని పోలీస్ ఆఫీస‌ర్‌గా చూపించ‌డంతో ట్విస్ట్ ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. అటు తార‌క్‌కు సినిమాలో ప్రాణ స్నేహితుడిగా క‌నిపించినా..బ్రిటీష‌ర్ల‌పై పోరాటం చేస్తోన్న తార‌క్‌నే అరెస్టు చేస్తున్నాన‌ని చెప్ప‌డంతో చ‌ర‌ణ్ బ్రిటీష్ పాల‌న‌లో పోలీస్ అధికారి అన్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది. అయితే ఈ పోలీస్ ఆఫీస‌ర్ అల్లూరిగా ఎక్క‌డ ? ఎలా ? మారాడో సినిమాలో మ‌నం చూడాలి.

అలియాభ‌ట్ & ఓవీలియో మోరిస్ :


సినిమాలో చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ క్రేజీ కుర్ర హీరోయిన్ అలియాభ‌ట్ న‌టిస్తోంది. త‌న చిరు చూపులు.. చక్క‌ని క‌ళ్ల‌తో ట్రైల‌ర్‌, స్టిల్స్‌, ప్ర‌మోష‌న్ల‌లో చంపేసింది. సినిమాలో ఆమె పాత్ర‌కు సెంటిమెంట్‌తో ముడిప‌డి ఉంద‌ని తెలుస్తోంది. ట్రైల‌ర్‌లో ఆమెను బ్రిటీష‌ర్లు త‌న్నే సీన్ చూపించారు. అప్ప‌టి వ‌ర‌కు బ్రిటీష‌ర్ల కింద పోలీస్ ఆఫీస‌ర్‌గా ఉన్న చ‌ర‌ణ్ వాళ్ల‌కు ఎదురు తిరిగి న‌ప్పుడు చ‌ర‌ణ్ ప్రేయ‌సి అయిన అలియాను ఎలా టార్గెట్ చేశారు ? ఆ టైంలో ఆమె విరోచిత న‌టన ఏంట‌న్న‌ది ఆస‌క్తిగానే ఉంది.
ఇక ఎన్టీఆర్ ప్రేయ‌సిగా బ్రిటీష్ రాజ్యానికే చెందిన యువ‌రాణి ఓవీలియో మోరిస్ క‌నిపించ‌నుంది. ఆమె బ్రిటీష్ యువ‌రాణి అయినా కూడా తార‌క్ అనంత ధైర్య సాహ‌సాలు చూపి ప్రేమ‌లో ప‌డ‌డంతో పాటు సాయం చేసే పాత్ర‌లో క‌నిపించ‌బోతోందా ? అన్న‌ట్టుగానే అనిపిస్తోంది. ఈ పాత్ర‌ను రాజ‌మౌళి ఎక్కువుగా రివీల్ చేయ‌లేదు. మ‌రి సినిమాలో ఉలా ఉండ‌బోతోందో చూడాలి.

ఇక మిగిలిన క్యారెక్ట‌ర్ల‌లో బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ కూడా పోరాట వీరుడిగా క‌నిపిస్తే.. ఆయ‌న భార్యగా శ్రీయా చ‌ర‌ణ్ కూడా బ్రిటీష‌ర్ల‌పై పోరాటం చేసే భ‌ర్త‌కు సాయం చేసే పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. ఇక కోలీవుడ్ డైరెక్ట‌ర్‌, న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని కూడా బ్రిటీష్ సామ్రాజ్యంలో ఓ పోలీస్ అధికారిగానే క‌నిపిస్తాడు. ఇక మిగిలిన న‌టుల్లో కొంద‌రు బ్రిటీన్‌కు, విదేశాల‌కు చెందిన న‌టులు క‌నిపించ‌బోతున్నారు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ వ‌ర్క్ అంచ‌నా:


త్రిబుల్ ఆర్ సాంకేతిక నిపుణుల వ‌ర్క్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అన్న‌ట్టుగా ఉంది. ట్రైల‌ర్ చూస్తేనే హాలీవుడ్ సినిమాను త‌ల‌ద‌న్నే రేంజ్‌లో విజువ‌ల్స్ ఉన్నాయి. రాజ‌మౌళి సినిమా అంటేనే సెంథిల్ ఎంత ఎఫ‌ర్ట్ పెట్టి ప‌ని చేస్తారో చెప్ప‌క్క‌ర్లేదు. బాహుబ‌లిని మించిన రేంజ్‌లో ఈ సినిమా విజువ‌ల్స్ ఉండ‌బోతున్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబుసిరిల్ వ‌ర్క్ ఎఫ‌ర్ట్స్ సినిమాను మ‌రో రేంజ్‌కు తీసుకు వెళ్ల‌నున్నాయి.

ఎంఎం. కీర‌వాణి:
రాజ‌మౌళి అన్ని సినిమాల‌కు కీర‌వాణే మ్యూజిక్ ఇచ్చారు. అస‌లు కీర‌వాణి – రాజ‌మౌళి కాంబినేష‌న్లో మైన‌స్ కూడా ప‌ట్టుకోలేం. తాజా త్రిబుల్ ఆర్ సినిమాలో సాంగ్‌లు వింటుంటేనే నెత్తురు మ‌రుగుతోంది.. గుండె ఉప్పొంగుతోంది..


నెత్తురు మ‌రిగితే ఎత్త‌ర జెండా
ఉలికి.. విలుకాడికి.. త‌ల‌కు ఊరితాడికి… క‌దిలే కార్చిచ్చుకి.. దోస్తీ
కొమ‌రం భీముడో.. కొమురం భీముడో.. ర‌గ‌లాలి కొడుకో.. పాట‌లు సినీ ల‌వ‌ర్స్‌ను మైమ‌రిపింజేస్తున్నాయి. ఇక నేప‌థ్య సంగీతం కూడా సినిమా విజ‌యంలో ఎంతో కీల‌కం కానుందని రాజ‌మౌళి చెప్పారు. ట్రైల‌ర్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద‌ర‌గొట్ట‌నుంది.

విజ‌యేంద్ర ప్ర‌సాద్ & సాయి మాధ‌వ్ బుర్రా


రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ మామూలుగానే అరాచ‌కం.. ఇక బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి సినిమాకు క‌థ ఇవ్వ‌డం అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. అందులోనూ ఇద్ద‌రు చ‌రిత్ర‌, స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల చ‌రిత్ర‌ను ఫిక్ష‌న్‌గా తీసుకోవ‌డం అంటే చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. పైగా చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించే ట‌ప్పుడు లిమిటెడ్ స్వేచ్ఛే ఉంటుంది. లేక‌పోతే విమ‌ర్శ‌లు వ‌స్తాయి. ఇవన్నీ బేరీజు వేసుకునే విజ‌యేంద్ర‌ స్టోరీ రాశాడు.

ఇక బాహుబ‌లి సినిమాకు మాట‌లు అందించాల్సిన బుర్రా సాయిమాధ‌వ్ అప్పుడు మిస్ అయ్యారు. ఇప్పుడు ప‌ట్టుబ‌ట్టి మ‌రీ రాజ‌మౌళి బుర్రాతో మాట‌లు అందించారు. ఈ కింది డైలాగులు చూస్తుంట‌నే త్రిబుల్ ఆర్‌లో ఇలాంటి ప‌వ‌ర్ ఫుల్ డైలాగుల‌కు కొద‌వ‌లేద‌నే అర్థ‌మ‌వుతోంది.
తొంగి తొంగి న‌క్కీ న‌క్కీ కాదే.. ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలే…
యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంత‌ట అవే వ‌స్తాయి..
భీమ్ ఈ న‌క్క‌ల వేట ఎంత సేపు.. కుంభ‌స్థ‌లాన్ని బ‌ద్ద‌లు కొడ‌దాం ప‌ద‌..

శ్రీక‌ర ప్ర‌సాద్ :


భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ గొప్ప ఎడిట‌ర్ శ్రీక‌ర ప్ర‌సాద్ ఎన్నో సినిమాల‌ను క్రిస్పీగా క‌ట్ చేసి జాతీయ స్థాయి అవార్డులు ఎన్నో సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమా ర‌న్ టైం 186 నిమిషాలుగా ఉంది. బాహుబ‌లి 2 పార్టులు అయినా కూడా రెండు పార్టుల ర‌న్ టైం 170 నిమిషాలు పైనే ఉంది. ఇక ఇద్ద‌రు క్రేజీ హీరోలు.. క‌థ పెద్ద‌ది కావ‌డంతో ర‌న్ టైం 186 నిమిషాలుగా ఉంది. మ‌రి శ్రీక‌ర ప్ర‌సాద్ ఎంత క్రిస్పీగా సినిమా క‌ట్ చేసి ప్రేక్ష‌కుల‌ను క‌న్నార్ప‌కుండా చేశారో చూడాలి.

నిర్మాత‌: డీవీవీ దాన‌య్య‌


నిర్మాత దాన‌య్య రాజ‌మౌళికి ఎప్పుడో 13 ఏళ్ల క్రితం అడ్వాన్స్ ఇచ్చారు. అప్ప‌టి నుంచి వెయిట్ చేస్తూ వ‌చ్చి మ‌ధ్య‌లో రాజ‌మౌళి ఓ చిన్న సినిమా చేయాల‌ని అనుకున్నా కూడా ఆయ‌న ఒప్పుకోలేదు. త‌న బ్యాన‌ర్లో పెద్ద సినిమా కావాల‌ని కోరారు. రాజ‌మౌళి ఆయ‌న కోరిక‌కు త‌గ్గ‌ట్టుగానే పెద్ద సినిమా కాదు.. తెలుగు సినిమా కాదు ఏకంగా భార‌త సినిమా చ‌రిత్ర‌లో నిలిచిపోయే సినిమా తీశారు. ఏకంగా రు. 500 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను ఆయ‌న నిర్మించారు.

రాజ‌మౌళి డైరెక్షన్ క‌ట్స్ :


తెలుగు సినిమా చ‌రిత్ర‌ను చూస్తే బాహుబ‌లికి ముందు.. బాహుబ‌లికి త‌ర్వాత అనేలా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాశాడు రాజ‌మౌళి. 20 ఏళ్ల క్రితం స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ సినిమాతో డైరెక్ట‌ర్ అయిన రాజ‌మౌళి సినిమా సినిమాకు ఈ రేంజ్లో ఎవ్వ‌రికి అంద‌నంత ఎత్తుకు ఎదిగిపోతాడ‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఇక బాహుబలి త‌ర్వాత రాజ‌మౌళి స్థాయి గురించి చ‌ర్చించుకోవ‌డం ఊహ‌ల‌కే అంద‌డం లేదు. బాహుబ‌లి ది కంక్లూజ‌న్ తెలుగు సినిమా స్థాయి ఇండియాకే కాదు.. ప్ర‌పంచ స్థాయి అని చాటి చెప్పాడు. ఆ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ఏ సినిమా చేస్తాడా ? అని అంద‌రూ ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తోన్న వేళ టాలీవుడ్‌లోనే ఇద్ద‌రు క్రేజీ యంగ్‌స్ట‌ర్స్ తార‌క్‌, చెర్రీ కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్ సెట్ చేశాడు. అస‌లు ఈ కాంబినేష‌న్ వేరెవ్వ‌రికి అయినా క‌ల‌లో కూడా జ‌రిగేదే కాదు. టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తోనే ఎన్నో సంచ‌ల‌నాల‌కు తెర‌దీసిన త్రిబుల్ ఆర్ అంచ‌నాలు గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. అస‌లు రాజ‌మౌళి ఎలాంటి విజువ‌ల్ వండ‌ర్ క్రియేట్ చేస్తాడో చెప్ప‌లేక‌పోతున్నాం.. మ‌రో ఊహాజ‌నిత ప్ర‌పంచాన్నిమ‌నం థియేట‌ర్ల‌లోనూ చూడాలి.

ప్రి రిలీజ్ బిజినెస్ & రిలీజ్ హైలెట్స్ :


రు. 250 కోట్ల బ‌డ్జెట్‌తో మూడున్న‌ర సంవ‌త్స‌రాల క్రితం సినిమా అనుకున్నారు. మూడేళ్ల‌కు పైగా షూటింగ్ జ‌రుపుకోవ‌డం.. మూడు సార్లు క‌రోనా రావ‌డం… మూడు సార్లు రిలీజ్ డేట్లు ఎనౌన్స్ చేశాక వాయిదా ప‌డ‌డంతో మొత్తం వ‌డ్డీల‌తో క‌లుపుకుని రు. 500 కోట్ల‌కు కాస్త అటూ ఇటూగా బ‌డ్జెట్ చేరింది. రామ్‌చ‌ర‌ణ్‌, తార‌క్‌కే ఒక్కొక్క‌రికి రు. 45 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌గా.. రాజ‌మౌళికి ఫ్యామిలీ ప్యాకేజ్‌తో పాటు లాభాల్లోనూ కొంత వాటా ఉంద‌ని టాక్ ? మొత్తంగా రు. 1000 కోట్ల వ‌సూళ్ల టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద యుద్ధానికి రెడీ అవుతోంది.

ఫైన‌ల్‌గా….


బాహుబ‌లి ది కంక్లూజ‌న్ లాంటి ఓ తెలుగు సినిమాతో భార‌త‌జాతి యావ‌త్‌ను మ‌న‌వైపున‌కు తిప్పిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన హై వోల్టేజ్ యాక్ష‌న్ ఈ త్రిబుల్ ఆర్‌. టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే ఇద్ద‌రు క్రేజీ స్టార్స్‌గా ఉన్న ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో సినిమా వ‌స్తుందా ? అన్న ఊహ‌ల‌నే ప‌టాపంచ‌లు చేస్తూ తెర‌కెక్కిన ఈ సినిమా బాహుబ‌లి రేంజ్లో హిట్ అయితే ఖ‌చ్చితంగా ప్ర‌తి తెలుగోడు స‌గ‌ర్వంగా త‌లెత్తుకుని ఇండియ‌న్ సినిమాలో మా తెలుగోడి చ‌రిత్ర ఇదిరా అని గ‌ర్వంగా చెప్పుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా సూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అవ్వాల‌ని తార‌క్‌, చెర్రీ, రాజ‌మౌళి అభిమానుల‌కు తెలుగులైవ్స్‌. కామ్ త‌ర‌పున ముంద‌స్తుగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాం.

– గ‌గ‌న్ అక్షిత్ రామ్‌

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news