అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో కొత్త సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. గత ఏడాది చివర్లో వచ్చిన బాలయ్య అఖండ ఇంకా థియేటర్లలో జన జాతరను తలపిస్తోంది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 103 కేంద్రాల్లో అఖండ అర్థ శతదినోత్సవం జరుపుకుంది. ఇక బాలయ్య – గోపీచంద్ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు.
ఇక గత ఏడాది తన క్రాక్ సినిమాలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ ను ఇక్కడ కూడా సెంటిమెంట్ గా కొనసాగించాలని దర్శకుడు గోపీచంద్ నిర్ణయించారు. వరలక్ష్మి శరత్ కుమార్ బాలయ్య సినిమాలో పవర్ ఫుల్ లేడీ విలన్గా కనిపిస్తారని టాక్ ? ఈ సినిమా పలనాడు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. సినిమాలో అదిరిపోయే యాక్షన్ – సెంటిమెంట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాకు వేటపాలెం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరిగింది.
అయితే సినిమాలో ఒక రోల్లో బాలయ్యను అందరూ పెద్దాయన పిలుచుకుంటారట. ఈ పాత్ర సినిమాకి హైలైట్గా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాకు వేటపాలెం కంటే పెద్దాయన అన్న టైటిల్ ఫిక్స్ చేస్తే బలంగా ఉంటుందని దర్శకుడు గోపీచంద్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. చెన్నకేశవరెడ్డి తరహాలో తండ్రీకొడుకుల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని అంటున్నారు. దర్శకుడు గోపీచంద్ త్వరలోనే ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.